ఈ నెల 23 వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నిర్ధారిస్తూ చేసిన ప్రకటనపై అధికారులు లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలాంటి విచారణ జరపవద్దని హైకోర్టు ఆదేశించింది. ఫాం-10 ఇవ్వని చోట ఏదైనా చర్యలు తీసుకున్నా.. ఎన్నికల సంఘం కానీ జిల్లా కలెక్టర్లు కానీ ఈ నెల 23 వరకు వాటిని ప్రకటించొద్దని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల గురించి జిల్లా కలెక్టర్లందరికీ సమాచారం పంపాలని ఎన్నికల సంఘానికి సూచించింది.
విచారణ వాయిదా..
ఈ మేరకు పూర్థి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. బెదిరింపులు, దౌర్జన్యాల కారణంగా గతేడాది ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ వేయలేనివారు, వేధింపులతో నామినేషన్ ఉపసంహరించుకున్న వారు ఆధారాలతో కలెక్టర్లను కలిసి ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం వెసులుబాటు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి వారు గతంలో ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి ఈ నెల 20లోపు నివేదిక అందజేయాలని కలెక్టర్లను ఆదేశిస్తూ ఎన్నికల కమిషనర్ 18న ఉత్తర్వులిచ్చారు.
ఆ ఉత్తర్వులను సవాల్ చేశారు..
వాటిని సవాలు చేస్తూ.. చిత్తూరు జిల్లా ఆరడిగుంట, సింగిరిగుంట, పీలేరుకు చెందిన ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం హైకోర్టులో అత్యవసరంగా రెండు వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ‘గతేడాది నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఒకే ఒక్క నామినేషన్ రావడంతో పిటిషనర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ధ్రువపత్రాలు (ఫాం 10) పొందారు.
'పిటిషన్ వేసుకోవడమే మార్గం'
ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులు చట్టవిరుద్ధం. నామినేషన్ ఒక్కటే వస్తే ఆ అభ్యర్థి ఎన్నికైనట్లు ఆర్‌వో తక్షణం ఉత్తర్వులివ్వాలి. వాటిని సమీక్షించే అధికారం ఎస్‌ఈసీకి ఉండదని కక్షిదారుల తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. పిటిషనర్ల తరఫు మరో న్యాయవాది వీఆర్‌ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. ‘ ఓసారి అభ్యర్థి ఎన్నికైనట్లు ప్రకటించాక.. దానిని రద్దు చేయించాలంటే ఎన్నికల ట్రైబ్యునల్లో ‘ పిటిషన్ దాఖలు చేసుకోవడమే మార్గమని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు.