High Court on MLC AnanthaBabu bail petition: దళిత యువకుడు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో పోలీసులు నిబంధనల ప్రకారం 90 రోజుల్లో ఛార్జ్‌షీట్ దాఖలు చేయని కారణంగా సీఆర్పీసీ 167 (బి) ప్రకారం తనకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ అనంతబాబు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు రిమాండ్ విధించిన 90 రోజుల్లో పోలీసులు అభియోగపత్రం దాఖలు చేయలేదని.. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను దిగువ కోర్టు తిరస్కరించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. సీఆర్పీసీ 167 (బి) ప్రకారం పిటిషనర్‌కు ఢిపాల్ట్ బెయిల్ మంజారు చేయాలని కోర్టును కోరారు.
నిబంధనల ప్రకారం గడువులోపే పోలీసులు కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. అభియోగప్రతంలో తప్పులున్నాయనే సాంకేతిక కారణాల వల్ల దానిని దిగువ కోర్టు తిరస్కరించిందన్నారు. నిర్ణీత సమయంలోపే అభియోగపత్రం దాఖలు చేసినట్లేనని తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం... అనంతబాబు బెయిల్ పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పునిచ్చింది.