ఈఎస్ఐకి వైద్య పరికరాలు, ఔషధాల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై అనిశా నమోదు చేసిన కేసులో ముందుస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తనయుడు పి.వెంకట సురేశ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.
పితాని వెంకట సురేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణ - ఈఎస్ఐ స్కామ్ న్యూస్
పితాని వెంకట సురేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఈఎస్ఐ కేసులో ముందస్తు బెయిల్ కోసం వెంకట సురేశ్ పిటిషన్ దాఖలు చేశారు.
వెంకట సురేశ్‌తోపాటు పితాని సత్యనారాయణ వద్ద పనిచేసిన మురళీమోహన్ విడిగా వేసిన పిటిషన్ కూడా కొట్టేసింది. మాజీ పీఎస్ మురళీని ఏసీబీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఔషధాల కొనుగోళ్లతో పిటిషనర్లకు సంబంధం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది చల్లా అజయ్ కుమార్ వాదనలు వినిపించారు. రాజకీయ కక్షతోనే వారిని కేసులో ఇరికించారన్నారు. తండ్రి అధికారాన్ని వెంకట సురేశ్ దుర్వినియోగపరచలేదని కోర్టుకు తెలిపారు. ఈఎస్ఐ కుంభకోణంలో పిటిషనర్ల పాత్ర ఉందని ఏసీబీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషనర్లు లబ్ధి పొందారన్నారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఈ రోజు ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. మరోవైపు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ వ్యక్తిగత కార్యదర్శి మురళీ మోహన్ సాధారణ బెయిలు కోసం సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇదీ చదవండి: ఎంపీ మంత్రివర్గంలో సింధియా వర్గానికి కీలక శాఖలు