ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సహకార సంఘాల పొడిగింపుపై మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరణ

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కాలపరిమితి పొడిగించాలని అభ్యర్థిస్తూ... పీఏసీఎస్ అధ్యక్షులు చేసిన ఆభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు నిరాకరించింది. పూర్తి వివరాలతో ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ... విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావు ఈమేరకు ఆదేశాలు జారీచేశారు.

హైకోర్టు

By

Published : Aug 3, 2019, 1:03 AM IST

పీఏసీఎస్​ల కాలపరిమితి పొడిగించాలని అభ్యర్థిస్తూ... గుంటూరు జిల్లా అప్పికట్ల పీఏసీఎస్, కృష్ణా జిల్లాకు చెందిన పీఏసీఎస్ అధ్యక్షుడు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ...సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా...నిర్వహణ బాధ్యతలను చూసేందుకు నచ్చిన వారితో ముగ్గురు సభ్యుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించలేనప్పుడు... అప్పటి వరకు ఉన్న పాలకమండలి కాలపరిమితి పొడిగించాల్సిన అవసరం ఉందన్నారు. జీవో 175 అమలును నిలుపుదల చేయాలని అభ్యర్థించారు.

సర్కారు తరపున అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ... స్వేచ్ఛాయుత మార్గంలో ఎన్నికల నిర్వహించడం తమ బాధ్యత అన్నారు. ఆయా సంఘాల్లో ఎక్కువ మంది సభ్యుల్ని చేర్చాలన్న ఉద్దేశంతోనే ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించడంలేదన్నారు. కాల పరిమితి ముగిశాక తమనే కొనసాగించాలని పిటిషనరు అభ్యర్థించడానికి వీల్లేదన్నారు. సహకార సంఘాల ఆర్థిక స్థితిగతులను మెరుగు పరచడంతోపాటు... ఓ క్రమబద్ధమైన విధానాన్ని తీసుకురావాలన్న సదుద్దేశంతో సర్కారు జీవో ఇచ్చిందన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... జీవో అమలు నిలుపుదల చేయడానికి, పిటిషనర్ పీఏసీఎస్​ల కాలపరిమితి పొడిగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి నిరాకరించారు.

ABOUT THE AUTHOR

...view details