రద్దయిన జీవో 938 వివరాలను ప్రస్తావిస్తూ మీడియాపై కేసులు పెట్టేందుకు వీలుగా జీవో 2430 ఎలా ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రద్దు అయిన జీవోని రిఫరెన్స్‌గా ఎందుకు పేర్కొన్నారో వివరణ ఇవ్వాలంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ తరపు న్యాయవాది జీవో 2430 అమలును నిలుపుదల చేయాలని కోరగా... అతని అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. ప్రభుత్వ వాదన వినకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టంచేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
జీవో 2430ని సవాలు చేస్తూ పిల్
అక్టోబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 2430ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్ తరపు న్యాయవాది ఎం. వేణుమాధవ్ వాదనలు వినిపిస్తూ...జీవో 2430 పత్రికా స్వేచ్ఛ, భావవ్యక్తీకరణ హక్కు హరించేలా ఉందన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేక వార్తలు రాస్తే కేసులు పెట్టేందుకు వీలుగా జీవో ఉందని తెలిపారు. ఆ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ...జీవోలో తప్పేముందని...ఆ జీవోతో మీరు ఏధంగా ప్రభావితులవుతారని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.