రాజధాని పరిధిలో బయటి వారికి ఇళ్లస్థలాల కేటాయింపుపై హైకోర్టులో వాదనలు జరిగాయి. అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి సమీకరించిన భూమిని... ఇళ్ల స్థలాలకు కేటాయించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదని ధర్మాసనం ప్రశ్నించింది. అభివృద్ధి పనులు చేపట్టాకే... సమీకరించిన భూముల్లో 5 శాతం భూమిని పేదలకు కేటాయించాలని సీఆర్డీఏ నిబంధనలు చెబుతున్నాయని గుర్తు చేసింది. అభివృద్ధి పనుల బాధ్యత నిర్వర్తించకుండా... ఏకపక్ష చర్యలు తీసుకోజాలదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వ చర్యలు సీఆర్డీఏకి విరుద్ధమని పేర్కొంది.
రాజధానిలో పరిధిలోని లేని గ్రామాల పేదల కోసం
అమరావతి నిర్మాణానికి సమీకరించిన భూమిలో... రాజధాని పరిధిలో లేని గ్రామాల పేదలకు ఇళ్ల స్థలాల కోసం... వెయ్యీ 251 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఈనెల 25న జీవో ఇచ్చింది. గుంటూరు జిల్లా తాడేపల్లి, పెదకాకాని, మంగళగిరి, దుగ్గిరాల మండలాలు సహా... విజయవాడ పరిధిలో కలిపి మొత్తం 54 వేల 307 మందికి స్థలాలు కేటాయింపుపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపును ఏ విధంగా సమర్థించుకుంటారో తెలియజేస్తూ సోమవారం నాటికి ప్రమాణపత్రం దాఖలు చేయాలని.... ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిస్తూ విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది. ఆలోపు లబ్ధిదారులకు ప్రభుత్వం పట్టాలిస్తుందేమోనని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి 25కి ముందుగా పట్టాలు ఇవ్వడం లేదని ఏజీ స్పష్టం చేశారు.
తుది నోటిఫికేషన్ ఇవ్వకుండానే...
సీఆర్డీఏ చట్టం ప్రకారం 5 శాతం భూమిని పేదలకు ఇళ్ల కోసం ఇవ్వవచ్చని ఏజీ(అడ్వొకేట్ జనరల్) వివరించారు. ఆ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ... భూసేకరణ ద్వారా, లేదా ప్రభుత్వ భూములను గుర్తించి.... ఎవరికైనా ఇళ్ల స్థలాలు ఇవ్వవచ్చని సూచించింది. రాజధానిలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నప్పుడు మాత్రమే 5 శాతం భూమిని ఇళ్ల నిర్మాణానికి పరిశీలించవచ్చని పేర్కొంది. అభివృద్ధి పనులు చేపట్టకుండా... తుది నోటిఫికేషన్ ఇవ్వకుండా.... భూకేటాయింపు గురించి ఎందుకు ఆలోచిస్తున్నారని ప్రశ్నించింది.