ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: పది పరీక్షలపై హైకోర్టులో విచారణ - telengana news

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైనా.. రెగ్యులర్ విద్యార్థులుగా గుర్తిస్తే ఇబ్బందేమిటని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పరీక్ష కేంద్రాలు కంటైన్​మెంట్ ప్రాంతాలుగా మారితే.. ఎలా వ్యవహరిస్తారో తెలపాలని ఆదేశించింది. ఇరుకు గదుల్లోని పరీక్ష కేంద్రాలను.. సమీపంలోని కళాశాలల్లోకి మార్చినట్లు ఆధారాలను సమర్పించాలని స్పష్టంచేసింది. శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు వివరాలన్నీ సమర్పించాలని స్పష్టం చేసింది.

telengana
పది పరీక్షలపై హైకోర్టులో విచారణ

By

Published : Jun 5, 2020, 7:46 PM IST

తెలంగాణలో పదో తరగతి పరీక్షలపై హైకోర్టులో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈనెల 8 నుంచి పరీక్షల నిర్వహణకు షెడ్యూల్​ రూపొందించిన విద్యాశాఖ.. హైకోర్టు తుది అనుమతి కోసం వేచిచూస్తోంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. కరోనా జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లు చేశామని విద్యాశాఖ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి నివేదించింది.

హైకోర్టు ఆదేశించినా.. కొన్ని చోట్ల పరీక్ష కేంద్రాలను మార్చలేదని.. భౌతిక దూరం పాటించడం సాధ్యం కాని ఇరుకు గదులు ఉన్నాయని న్యాయవాది నగేష్ వాదించారు. ఇరుకు గదులున్న పరీక్ష కేంద్రాలను సమీపంలోని కళాశాలల్లోని విశాలమైన గదులకు మార్చినట్లు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ధర్మాసనానికి నివేదించారు. అలాంటి భవనాలు హైదరాబాద్​లోనే 65 ఉన్నాయని చెప్పారు.

  • మా ఆదేశాలు పాటిస్తేనే అనుమతులు..

రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని కేంద్రాలు మార్చారు.. గత నెల 19న తాము ఇచ్చిన ఆదేశాలను ఎంత మేరకు అమలు చేశారో.. ఆధారాలను శనివారం సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మే 19 నాటి ఆదేశాలను పూర్తిగా అమలు చేయాలని.. లేకుంటే పరీక్షలకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది. విద్యార్థుల ఆరోగ్యం ముఖ్యమని.. అందులో రాజీపడేది లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది.

  • కంటైన్​మెంట్​ జోన్లుగా మారితే..

కంటైన్​మెంట్ జోన్లలో పరీక్ష కేంద్రాలు లేవని ప్రభుత్వం చెబుతోందని.. రానున్న రోజుల్లో కేంద్రాలు కంటైన్​మెంట్ ప్రాంతాలుగా మారితే విద్యార్థులు ఇబ్బంది పడతారని మరో పిటిషనర్ తరఫు న్యాయవాది కె.పవన్ కుమార్ వాదించారు. కంటైన్​మెంట్​ జోన్ల పరిధిలోని విద్యార్థులు కేంద్రాలకు ఎలా వెళ్తారు.. పరీక్ష కేంద్రాలున్న ప్రాంతాలు కంటైన్​మెంటుగా జోన్లుగా మారితే ఏం చేస్తారో రేపటిలోగా తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

  • రెగ్యులర్​గా పరిగణిస్తారా..

ఒకవేళ విద్యార్థులు ఏదైనా కారణంగా పరీక్షలకు హాజరుకాకపోతే.. వారి కోసం ఆగస్టు లేదా సెప్టెంబరులో సప్లిమెంటరీ పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారిని కూడా రెగ్యులర్​గా ఉత్తీర్ణులైనట్లుగా గుర్తించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది పవన్ కుమార్ వాదించారు. పిటిషనర్​ సూచన సమంజసమేనని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

  • ప్రభుత్వం నిర్ణయం కోసం..

99 శాతం మార్కులు వచ్చినా.. సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైనట్లు ముద్రపడుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారిని రెగ్యులర్ విద్యార్థులుగా పరిగణించడానికి ప్రభుత్వం సిద్ధమేనా.. అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం సరళతరంగా వ్యవహరించాలని సూచించింది. ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయాన్ని రేపు చెబుతామని ఏజీ విజ్ఞప్తి చేశారు. దీంతో విచారణను రేపటికి వాయిదా వేసింది.

  • ఇన్నాళ్లు ఏం చేశారు..?

ప్రైవేట్ పాఠశాలలకు చెందిన హాస్టళ్లలో పదోతరగతి విద్యార్థులకు వసతి కల్పించేందుకు తాత్కాలిక అనుమతినిస్తున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వ్యాజ్యంలో ఇంప్లీడ్ అయ్యేందుకు తనకు అనుమతివ్వాలన్న బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. సుమారు మూడు నెలలుగా విచారణ జరుగుతుంటే.. ఇన్నాళ్లు ఏం చేశారని ప్రశ్నించింది.

ఇవీచూడండి:గోదావరి బేసిన్​లో ఒక్క కొత్త ప్రాజెక్టు చేపట్టలేదన్న తెలంగాణ

ABOUT THE AUTHOR

...view details