ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 5, 2021, 1:46 PM IST

Updated : Feb 6, 2021, 7:12 AM IST

ETV Bharat / city

9వ తేదీ వరకు 'ఈ-వాచ్' వాడొద్దు: హైకోర్టు

ap high court on ewatch app
ap high court on ewatch app

13:43 February 05

ఈ నెల 9 వరకు వినియోగించొద్దు

ఈ- వాచ్ యాప్ విచారణపై మాట్లాడుతున్న న్యాయవాది శ్రవణ్ కుమార్

పంచాయతీ ఎన్నికల కోసం రూపొందించిన ‘ఈ-వాచ్‌’ యాప్‌ను ఈ నెల 9 వరకు వినియోగంలోకి తీసుకురాకుండా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ఎస్‌ఈసీని) నిలువరిస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. మరోవైపు ఆ యాప్‌కు సెక్యూరిటీ ఆడిట్‌ సర్టిఫికేషన్‌ ఇచ్చే ప్రక్రియను కొనసాగించుకోవచ్చని, తమ ఉత్తర్వులు అందుకు అడ్డంకి కాదని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ-వాచ్‌ యాప్‌నకు సెక్యూరిటీ ఆడిట్‌ సర్టిఫికేషన్‌ కోసం ఎస్‌ఈసీ కార్యదర్శి.. యాప్‌లను ధ్రువీకరించే ఏపీ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్‌ (ఏపీటీఎస్‌) ఎండీకి ఈ నెల 4న లేఖ రాశారని ప్రభుత్వ న్యాయవాది సుమన్‌ చెప్పారు. ఏపీటీఎస్‌ ధ్రువీకరణ లేకుండా యాప్‌ను వినియోగించడానికి వీల్లేదన్నారు. యాప్‌ను ధ్రువీకరించడానికి ఐదు రోజులు పడుతుందన్నారు. దీంతో ధర్మాసనం విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఎస్‌ఈసీ సొంతంగా ప్రైవేటు యాప్‌ను తీసుకొచ్చిందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో మూడు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలైన సంగతి తెలిసిందే.
 

సొంతంగా రూపొందించుకోవచ్చు: 

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన యాప్‌ను ఎందుకు వినియోగించడం లేదని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వ మూలాధార యాప్‌లపై ఆధారపడకుండా ప్రతి ఎస్‌ఈసీ సొంత యాప్‌ను రూపొందించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రోత్సహిస్తోందని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ చెప్పారు. యాప్‌ ద్వారా వినియోగదారుల గోప్యతకు భంగం వాటిల్లదన్నారు. ఏపీలో యాప్‌ తీసుకొచ్చే ప్రక్రియ ఆరేడు నెలలుగా కొనసాగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘంతో ఎస్‌ఈసీ జరిపిన సంప్రదింపుల వివరాల్ని సీల్డ్‌ కవర్లో కోర్టు ముందుంచుతామని చెప్పగా ధర్మాసనం అందుకు నిరాకరించింది. భారత ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాష్‌దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ.. స్థానిక ఎన్నికల విషయంలో ఎస్‌ఈసీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చన్నారు.  


మాచర్ల సీఐపై కోర్టులో పిటిషన్‌: 

గుంటూరు జిల్లా మాచర్ల సీఐ భక్తవత్సలరెడ్డిని ఎన్నికల విధులు నిర్వహించకుండా నిలువరిస్తూ ఆదేశించాలంటూ న్యాయవాది పారా కిశోర్‌ గురువారం హైకోర్టును ఆశ్రయించారు. సీఐ తెదేపా కార్యకర్తలను బెదిరిస్తున్నారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైకాపా నేతలకు మద్దతుగా వ్యవహరించారన్నారు. సీఐ బెదిరింపులపై ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. 

ఇదీ చదవండి:

'ఈ వాచ్​' యాప్​పై ప్రభుత్వం కోర్టులో పిటిషన్ వేయకపోతే ఆశ్చర్యం: నిమ్మగడ్డ

Last Updated : Feb 6, 2021, 7:12 AM IST

ABOUT THE AUTHOR

...view details