తెలంగాణలోని సైదాబాద్ దుర్ఘటన నిందితుడు బాలకొండ రాజు మృతిపై న్యాయవిచారణ కోరుతూ పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రొఫెసర్ లక్ష్మణ్ లంచ్ మోషన్ పిల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.అమరనాథ్ గౌడ్ ధర్మాసనం మధ్యాహ్నం అత్యవసర విచారణ చేపట్టింది. అత్యంత దారుణంగా ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి, హత్య ఘటనలో ఒకవేళ రాజుకు ప్రమేయం ఉందనుకుందని భావించినా.. చట్టప్రకారం వ్యవహరించడంలో పోలీసులు విఫలమయ్యారని పిటిషన్ తరఫు న్యాయవాది వెంకన్న వాదించారు. ఈనెల 10నే రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. పోలీసులను అభినందిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారని.. ఎన్కౌంటర్ చేస్తామని మంత్రి మల్లారెడ్డి ప్రకటన చేశారని.. రెండు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారని వాదించారు. రాజును పోలీసులు హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని న్యాయవిచారణకు ఆదేశించడంతో పాటు.. రాజు కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
పౌరహక్కుల సంఘం వాదనలను అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తోసిపుచ్చారు. రాజును పోలీసులు కస్టడీలోకే తీసుకోలేదన్నారు. రాజు ఆత్మహత్య చేసుకున్నాడని ఏజీ వివరించారు. ఇద్దరు లోకో పైలట్లు సహా ఆరుగురు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారని తెలిపారు. ఆత్మహత్య జరిగిన వెంటనే రైలు డ్రైవర్లు వాకీ టాకీలో ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారన్నారు. ఏడుగురు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడంతో పాటు... ఆ ప్రక్రియను వీడియో చిత్రీకరించినట్లు ఏజీ వివరించారు. మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారని.. దహన సంస్కారాలు కూడా పూర్తయ్యాయన్నారు. రాజు ఆత్మహత్యపై ఎలాంటి విచారణ అవసరం లేదని.. దానివల్ల విలువైన సమయం వృథా అవుతుందని ఏజీ తెలిపారు.
ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం.. రాజు మరణంపై అనుమానాలు ఉన్నందున.. నిర్ధారించుకోవడానికి విచారణ అవసరమని భావిస్తున్నట్లు పేర్కొంది. ఇరువైపుల వాదనలపై తాము ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేదని స్పష్టం చేసింది. విచారణ జరపాలని వరంగల్ మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌ను హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో విచారణ జరిపి సీల్డు కవర్లో నివేదిక సమర్పించాలని మేజిస్ట్రేట్‌ను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు, కుటుంబ సభ్యులు, ఇతరులెవరైనా రాజు మృతికి సంబంధించిన సమాచారం ఉంటే మేజిస్ట్రేట్‌కు ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. పోస్టుమార్టం వీడియోను సీడీ లేదా పెన్‌డ్రైవ్ రూపంలో రేపు రాత్రి 8 గంటలలోగా వరంగల్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జికి అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ సీడీ లేదా పెన్ డ్రైవ్ అందగానే వెంటనే హైకోర్టుకు పంపించాలని వరంగల్ జిల్లా జడ్జికి స్పష్టం చేసింది. పూర్తి స్థాయి విచారణ కోసం హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, వరంగల్ సీపీ, సికింద్రాబాద్ రైల్వే ఎస్పీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.