వాలంటీర్ తప్పు చేస్తే ఎవరు శిక్షిస్తారు.. సర్వీసు నిబంధనలేంటి? : హైకోర్టు - హైకోర్టు వార్తలు
15:27 May 06
వాలంటీర్ల సర్వీసు నిబంధనలు ఏమిటని ప్రశ్నించిన హైకోర్టు
90 శాతం వైకాపా కార్యకర్తలతో నింపేసిన వాలంటీర్ వ్యవస్థపై.. హైకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. వాలంటీర్ల సర్వీసు నిబంధనలు ఏమిటని ప్రశ్నించింది. పింఛను సొమ్ముతో వాలంటీర్ పరారైన ఘటనను కోర్టు ప్రస్తావించింది. 45 ఏళ్లు దాటిన మహిలకు ఏటా 18 వేల రూపాయలు పంపిణీ చేసే "వైఎస్ఆర్ చేయూత" పథకంలో అర్హులకు సాయం నిలిపివేశారంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.
తమకు వైఎస్సార్ చేయూత పథకం అమలు చేయకపోవడంపై గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడుకు చెందిన గ్రామస్థులు రామనాధం వసంత లక్ష్మి తోపాటు 26 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం దీనిపై విచారణ సందర్భంగా.. అర్హులైన వారికి రాజకీయ దురుద్దేశాలతో పథకాన్ని నిలుపుదల చేశారని పిటిషనర్ల తరపున న్యాయవాది అరుణ్ శౌరి వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. వాలంటీర్లు ఏడుగురికి వ్యక్తిగతంగా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వాలంటీర్లకు ఉన్న సర్వీసు నిబంధనలు ఏమిటని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. పింఛనుదారుల సొమ్ముతో వాలంటీర్ పరారీ, శ్రీకాకుళంలో ఘటనలపై పత్రికల్లో వచ్చిన వార్తలను ఈ సందర్భంలో ప్రస్తావించింది. వాలంటీర్ తప్పు చేస్తే ఎవరు శిక్షిస్తారు?. వాలంటీర్లు లబ్ధిదారుడ్ని ఎంపిక చేయడంపై హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించిన న్యాయస్థానం.. తదుపరి విచారణ వాయిదా వేసింది.
ఇదీ చదవండి: మద్యం ప్రధాన చట్టానికి సవరణపై హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు