ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HIGH COURT: బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటు సరికాదు: హైకోర్టు

HIGH COURT ON VINAYAKA CHAVITHI
బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతించలేం: హైకోర్టు

By

Published : Sep 9, 2021, 3:32 PM IST

Updated : Sep 9, 2021, 7:06 PM IST

15:29 September 09

కొవిడ్‌ దృష్ట్యా పబ్లిక్‌ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటు సరికాదు: హైకోర్టు

పబ్లిక్‌ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతించలేమని రాష్ట్ర హైకోర్టు(high court) స్పష్టం చేసింది. కొవిడ్‌ దృష్ట్యా పబ్లిక్‌ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటు సరికాదన్న ధర్మాసనం.. ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే గణేశ్​ ఉత్సవాలు జరుపుకోవాలని పేర్కొంది. అన్ని ప్రదేశాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటు(ganesh idols)కు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. ధార్మిక పరిషత్‌ వేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది.

లంచ్ మోషన్ పిటిషన్‌పై బుధవారం విచారణ

గణేశ్‌ ఉత్సవాలపై దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. ప్రైవేటు ప్రదేశాల్లో వినాయకుడి విగ్రహాలు, మండపాలు ఏర్పాటు చేసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. పూజా సమయంలో ఒక్కసారికి అయిదుగురిని మాత్రమే అనుమతించాలని నిర్వాహకులకు స్పష్టం చేసింది. అంతకంటే ఎక్కువ మంది ఒకచోట చేరకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు, మండపాలు ఏర్పాటు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. రాజ్యాంగం ప్రకారం మతపరమైన కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛ ప్రజలకు ఉందని.. ఇలాంటి కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో నిషేధం విధించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ప్రజారోగ్యం, మతపరమైన విశ్వాసాలు రెండూ ప్రధానమేనని... వాటి వ్యవహారంలో ప్రభుత్వం సమన్వయంతో వ్యవహరించాలని సూచించింది. ప్రజాశాంతి, ఆరోగ్యం దృష్ట్యా అవసరమైతే సముచితమైన ఆంక్షలు విధించే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కేశవాయనగుంట ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ ఆర్‌.మణికాంత్‌ వర్మ, ఎస్‌.ప్రశాంత్‌, తిరుపతి ఆటోనగర్‌కు చెందిన ఓంకార్‌ హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. 

 రాజకీయ పార్టీల సమావేశాలకు అనుమతిస్తున్నారు!: మణికాంత్‌, ప్రశాంత్‌ తరఫున న్యాయవాది భూపేశ్‌ వాదనలు వినిపించారు. పోలీసుల అనుమతితో గతంలోనూ చవితి ఉత్సవాలు నిర్వహించామన్నారు. గతేడాది కొవిడ్‌ తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లోనూ నిబంధనలను అనుసరించి ఉత్సవాలు జరిపామన్నారు. నిబంధనల మేరకు ఈ ఏడాది నిర్వహిస్తామని పోలీసులకు విజ్ఞప్తి చేసినా అనుమతి లభించలేదన్నారు. రాజకీయ పార్టీల సమావేశాలకు అనుమతిస్తున్నారని గుర్తుచేశారు. మరో పిటిషనర్‌ ఓంకార్‌ తరఫున న్యాయవాది కుర్రా శ్రీనివాసులు వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగం ప్రకారం మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తామని, ప్రైవేటు స్థలంలో విగ్రహం ఏర్పాటు చేసుకుంటామని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదన్నారు.

అలాగైతే 4వేల అనుమతులివ్వాలి: ప్రభుత్వ న్యాయవాది

ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సుమన్‌, జీపీ మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ..  ఉత్సవాలపై నిషేధం విధించలేదని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో మండపాలు, విగ్రహాలు ఏర్పాటు చేయకుండా మాత్రమే ఉత్తర్వులిచ్చామన్నారు. ఈ మేరకు డీజీపీ జిల్లా ఎస్పీలకు సందేశం పంపారన్నారు. కొవిడ్‌ నిబంధనలకు లోబడి ఉత్సవాల నిర్వహణపై షరతులు విధించామన్నారు. సహేతుకమైన ఆంక్షలు విధించే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపారు. పిటిషనర్లకు అనుమతిస్తే రాష్ట్రవ్యాప్తంగా నాలుగువేల చోట్ల అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి.. మండపాలు, విగ్రహాలు పూర్తిగా ప్రైవేటు ప్రాంతంలో పెట్టుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగ ప్రదేశంలో మండపం, విగ్రహం పెట్టడానికి వీల్లేదన్నారు.

ఇదీ చదవండి..

Last Updated : Sep 9, 2021, 7:06 PM IST

ABOUT THE AUTHOR

...view details