విజిలెన్స్ కమిషన్ కార్యాలయాన్ని ఎక్కడో ఏర్పాటు చేయడం వల్ల పర్యవేక్షణ ఎలా సాధ్యమవుతుందో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సాధారణ పరిపాలన శాఖకు విజిలెన్స్ కమిషన్‌కు సంబంధం ఏ విధంగా లేదో వివరించాలంది. పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయడం కోసం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు రాజధాని వ్యవహారంలో దురుద్దేశంతో వ్యవహరించారని, న్యాయ ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులను ఓ పిల్‌లో ప్రతివాదులుగా చేర్చడంపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తంచేసింది. వివిధ అభ్యర్థులను ఒకే వ్యాజ్యంలో ఎందుకు కోరారని పిటిషనర్ రమేశ్ తరఫు న్యాయవాది మురళీధరరావును ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది.
న్యాయవ్యవస్థ హుందాతనం ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో తమకు అధికారాలున్నాయని గుర్తుచేసింది. న్యాయ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఎవరు ఏమి మాట్లాడారో తెలుసని పేర్కొంది. ప్రతి అంశంపై విచారణ జరపాలని కోరితే ఎలా అని ధర్మాసనం ప్రశ్నించింది. రాజకీయ వ్యాఖ్యల విషయంలో వారిపై విచారణకు ఆదేశించలేమని పేర్కొంది. వారికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. రాజధాని, కార్యాలయాల తరలింపు అంశానికే అభ్యర్థన పరిమితం కావాలని పిటిషనర్ రమేశ్ తరఫు న్యాయవాది మురళీధరరావుకు సూచించింది. అందుకు న్యాయవాది అంగీకరించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.