ప్రాథమిక విచారణ నివేదికలను పిటిషనర్లకు అందజేయకుండా ఎస్టీ - వాల్మీకి కుల ధ్రువపత్రాల వాస్తవికత(high court on st Valmiki caste certificate) ను తేల్చే నిమిత్తం విచారణకు హాజరుకావాలంటూ.. తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్, జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీ(డీఎల్ఎస్సీ) ఛైర్మన్ నోటీసులు ఇవ్వడం సరికాదని హైకోర్టు పేర్కొంది. బోగన్ కుల ధ్రువపత్రాల వ్యవహారంపై తహసీల్దార్ల బృందం ఇచ్చిన నివేదిక, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, కలెక్టర్ ఇచ్చిన నివేదికను ఎనిమిది వారాల్లో పిటిషనర్లకు అందజేయాలని ఆదేశించింది. తద్వారా అధికారులు ఇచ్చిన నోటీసులకు పిటిషనర్లు సరైన వివరణ ఇచ్చేందుకు వీలుంటుందని తెలిపింది. ఎస్టీ కుల ధ్రువపత్రాల ఆరోపణలపై విచారణను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించింది. ఇప్పటికే చాలా మందికి నోటీసులు ఇచ్చారని గుర్తుచేసింది. బృందాల వారీగా విచారణ నిర్వహిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె .విజయలక్ష్మి ఇటీవల ఈమేరకు పలు వాజ్యాల్లో తీర్పు వెల్లడించారు.
నకిలీ ఎస్టీ వాల్మీకి కుల ధ్రువపత్రాల వాస్తవికతను తేల్చేందుకు విచారణకు హాజరుకావాలంటూ 2019 జనవరిలో కాకినాడ డీఎల్ఎస్సీ ఛైర్మన్ ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ.. రాజవొమ్మంగి మండల పరిధిలోని వంచంగి, తదితర గ్రామాలకు చెందిన పలువురు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. వారి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ .. 1988 ఫిబ్రవరి 20 కాకినాడ జిల్లా కలెక్టర్ జారీచేసిన సర్య్కులర్లోని మార్గదర్శకాల ఆధారంగా పిటిషనర్లకు కుల ధ్రువపత్రాలు ఇచ్చారు. తప్పుడు ఫిర్యాదు ఆధారంగా అధికారులు విచారణ చేస్తున్నారు. విచారణకు ముందు తహశీల్దార్ల కమిటీ పిటిషనర్లకు నోటీసు ఇవ్వకుండా ప్రక్రియ పూర్తి చేసి ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారికి నివేదిక సమర్పించింది. తహశీల్దార్ల కమిటీ నిర్వహించిన విచారణ గురించి పిటిషనర్లకు తెలీదు. నివేదికల దస్త్రాలు పిటిషనర్లకు ఇవ్వలేదు అన్నారు.