ఎస్సీలకు వేర్వేరుగా మూడు కార్పోరేషన్ల ఏర్పాటు జీవో చట్టబద్ధతను తాజాగా తేల్చాలని హైకోర్టు సింగిల్ జడ్జిని కోరుతూ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. జీవోను సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేస్తూ సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను... హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్. జయసూర్యతో కూడిన ధర్మాసనం రద్దు చేసింది. మాల, మాదిగ, రెల్లి తదితర కులాలకు వేర్వేరుగా మూడు కార్పొరేషన్ల ఏర్పాటు కోసం గతేడాది ఆగస్టులో జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ.... అఖిల భారత దళిత్ హక్కుల ఫోరం జాతీయ అధ్యక్షుడు ఆనందరావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ వాదనలను తోసిపుచ్చిన హైకోర్టు సింగిల్ జడ్జి వ్యాజ్యాన్ని కొట్టేశారు.
'సబ్ ప్లాన్ చట్టం ఉండగా.. కార్పొరేషన్లు ఎందుకు?' - ఎస్సీలకు వేర్వేరు కార్పోరేషన్ల పై హైకోర్టు వ్యాఖ్య
ఎస్సీలకు వేర్వేరుగా మూడు కార్పోరేషన్ల ఏర్పాటు జీవోను సవాల్ చేస్తూ వేసిన వ్యాజ్యాన్ని పునరుద్ధరించి తాజాగా విచారణ జరపాలని సింగిల్ జడ్జిని హైకోర్టు కోరింది. సింగిల్ జడ్జి వద్ద కౌంటర్ దాఖరు చేయాలని ప్రభుత్వానికి సూచించింది .

దీనిపై ధర్మాసనం ముందు ఆనందరావు... అప్పీల్ దాఖలు చేశారు. సంక్షేమ పథకాల అమలుకు.. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం అమల్లో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకురావడానికి వీల్లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఎస్సీలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే మూడు కార్పోరేషన్లు ఏర్పాటు చేశామని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. సబ్ ప్లాన్ చట్టం ఉండగా కార్పొరేషన్ల ఏర్పాటును ఎలా సమర్థించుకుంటారని వ్యాఖ్యానించింది. కేసు వివరాల్లోకి తాము వెళ్లడం లేదని స్పష్టం చేస్తూ సింగిల్ జడ్జి వద్ద కౌంటర్ దాఖరు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. వ్యాజ్యాన్ని పునరుద్ధరించి తాజాగా విచారణ జరపాలని సింగిల్ జడ్జిని కోరింది.
ఇదీ చదవండి :నేటి నుంచి తెదేపా ప్రజాచైతన్య యాత్ర