మద్యం ద్వారా వస్తున్న ఆదాయాన్ని ప్రత్యేక మార్జిన్ మనీ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లించడం, ఆ మొత్తాన్ని ఆదాయంగా చూపి ఆర్థిక సంస్థల ద్వారా రుణాలు పొందడాన్ని సవాలు చేస్తూ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించలేమని, తగిన ఉత్తర్వులిస్తామని, వాటిపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.
మద్యం ద్వారా వస్తున్న ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లించి, దానిని ఆదాయంగా చూపి ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందేందుకు వీలుగా.. ఏపీ మద్యం చట్టానికి సవరణ చేస్తూ.. తీసుకొచ్చిన ‘సవరణ చట్టాలను’ (యాక్ట్ 31/2021, యాక్ట్ 9/2022) రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. బుధవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. ఎంపీ తరఫున న్యాయవాది అంబటి సుధాకరరావు వాదనలు వినిపించారు. పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్‌కు(సంచిత నిధి) జమచేయాల్సి ఉందన్నారు. అందుకు భిన్నంగా మద్యం అమ్మకాల ద్వారా వచ్చే పన్నును బెవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లించి దాన్ని ఆదాయంగా చూపి, హామీ ఇస్తూ రుణం పొందుతున్నారన్నారు.
ట్రెజరీకి చెందాల్సిన సొమ్మును బెవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కుతోందన్నారు. మద్యం రాబడిని హామీగా చూపి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా తాజాగా రూ.8వేల కోట్లకుపైగా రుణం పొందినట్లు చెప్పారు. కేంద్రం నిర్దేశించిన రుణ పరిమితిని మించి రాష్ట్ర ప్రభుత్వం అప్పుచేస్తోందని వివరించారు. సంక్షేమ పథకాలను అడ్డుకోవాలనేది తమ ఉద్దేశం కాదని.. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడినప్పుడు న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని కోరుతున్నామని వివరించారు. పన్నుద్వారా వచ్చే ఆదాయాన్ని బెవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లించడానికి వీల్లేదన్నారు.