ఏపీ హైకోర్టుకు చెందిన కొంతమంది న్యాయమూర్తుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని.. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ...విశాఖ జిల్లా గోపాలపట్నానికి చెందిన న్యాయవాది ఎ.నిమ్మీగ్రెస్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం ధర్మాసనం విచారణ చేసింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ .. ఐపీఎస్ అధికారి పేరు, ఇతర వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేశామని కోర్టుకు తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ .. తాజాగా దాఖలు చేసిన అదనపు అఫిడవిట్‌లోని వివరాలను.. ప్రధాన అఫిడవిట్ అభ్యర్థనల్లో(ప్లీడింగ్స్) చేరుస్తూ.. సవరించిన దస్త్రం వేయాలని సూచించింది. ప్రతివాదులకు నోటీసు ఇస్తే ప్రధాన అఫిడవిట్‌లోని అంశాలకు సమాధానం ఇస్తారని.. అదనపు అఫిడవిట్‌కు కాదని తెలిపింది. అభ్యర్థనలను సవరించకపోతే .. అదనపు అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకోబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. న్యాయవాది స్పందిస్తూ .. ఆదేశిస్తే ప్రధాన అఫిడవిట్లో అభ్యర్థనలను సవరిస్తూ, అఫిడవిట్ వేస్తానన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. తాము ఆదేశాలివ్వలేమని.. అలాంటి ఆదేశాలిస్తే మరోరోజు మరొకటి చెబుతారని వ్యాఖ్యానించింది.