ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పీఆర్సీ సిఫార్సులే చేయగలదు.. వాటిని ఆమోదించడం.. తిరస్కరించడం ప్రభుత్వ పరిధిలోనిది - ఏపీ పీఆర్సీ పై కోర్టులో విచారణ

High Court on PRC Petitions: పీఆర్సీకి చట్టబద్ధత లేదని, ఆ కమిషన్‌ సిఫార్సులే చేయగలదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కౌంటరు వేసింది. ఆ సిఫార్సులను అంగీకరించాలా, లేదా అనేది ప్రభుత్వ విచాక్షణాధికారం అని తెలిపింది. పిటిషనర్​ తరఫు న్యాయవాది విజ్ఞప్తి మేరకు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

High Court On prc
High Court On prc

By

Published : Mar 10, 2022, 4:07 AM IST

పీఆర్సీకి చట్టబద్ధత లేదని, ఆ కమిషన్‌ సిఫార్సులే చేయగలదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కౌంటరు వేసింది. ఆ సిఫార్సులను అంగీకరించాలా, లేదా అనేది ప్రభుత్వ విచాక్షణాధికారం అని తెలిపింది. అశుతోష్‌ మిశ్ర కమిషన్‌ చేసిన మొత్తం 18 సిఫార్సుల్లో పదకొండింటిని నేరుగా, మరో ఐదింటిని సవరణలతో ప్రభుత్వం అంగీకరించిందని, రెండింటినే తిరస్కరించిందని పేర్కొంది. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ కోర్టులో ఈ కౌంటరు దాఖలు చేశారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటరుకు తిరుగు సమాధానం ఇచ్చేందుకు పిటిషనరు తరఫు న్యాయవాది పి.రవితేజ సమయం కోరడంతో విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
జనవరి 17న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ ఉత్తర్వులను సవాలుచేస్తూ ఏపీ గెజిటెడ్‌ అధికారుల ఐకాస ఛైర్మన్‌ కేవీ కృష్ణయ్య హైకోర్టులో వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. కమిషన్‌ నివేదికతో పాటు, కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హైకోర్టులో కౌంటరు వేశారు.

కౌంటర్లో పేర్కొన్న వివరాలు ఇవే..

‘కోర్టు ఆదేశాల మేరకు పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోలను పిటిషనరు తరఫు న్యాయవాదికి అందజేశాం. ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం ఈ ఏడాది జనవరి 17న సవరించిన పేస్కేలు విషయంలో జీవో 1ని జారీచేశాం. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఉద్యోగులకు 30% హెచ్‌ఆర్‌ఏ ఇవ్వడం ప్రభుత్వ విధానపరమైన, తాత్కాలిక నిర్ణయం. దాన్ని కొనసాగించాలంటూ పిటిషనరు చేస్తున్న అభ్యర్థన ఆమోదయోగ్యం కాదు.

హెచ్‌ఆర్‌ఏ సవరణ సాధారణ విషయం

పిటిషనరు చెబుతున్నట్లు ప్రభుత్వం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించలేదు. పీఆర్సీ అమలు తర్వాత హెచ్‌ఆర్‌ఏ సవరణ సాధారణమే. ఏపీలో హెచ్‌ఆర్‌ఏను నిర్ణయించడానికి 7వ కేంద్ర సీపీసీలోని విధానాన్ని పరిగణనలోకి తీసుకున్నాం.

పిటిషనర్‌ జీతం తగ్గిందని, రికవరీ చేశారని పేర్కొనలేదు

11వ పీఆర్సీ సిఫార్సులపై తుది నిర్ణయం తీసుకునేలోపు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తితో మూల వేతనంలో 27% మధ్యంతర భృతి ఇచ్చాం. అధికంగా చెల్లించి ఉంటే తర్వాత సర్దుబాటు చేస్తామని అప్పట్లోనే పేర్కొన్నాం. పే, డీఏ బకాయిలకు మించి ఉద్యోగులు ఐఆర్‌ ఎక్కువగా డ్రా చేసుకుని ఉంటే భవిష్యత్తు డీఏలో సర్దుబాటు చేస్తామని తాజా పీఆర్సీ జీవోలో పేర్కొన్నాం. అయినా ఉద్యోగుల నుంచి రికవరీ చేయలేదు. పిటిషనరు సైతం.. తన జీతం తగ్గిందని కానీ, జీతాన్ని రికవరీ చేశారని కానీ అఫిడవిట్లో పేర్కొనలేదు.

  • పీఆర్సీ సిఫార్సులను ప్రభుత్వం అంగీకరించడమే కాకుండా.. అందులో పేర్కొన్న దానికంటే కొన్ని ప్రయోజనాలను పెంచింది. పీఆర్సీ స్ట్రగుల్‌ కమిటీ 2022 జనవరి 24న ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చింది. తర్వాత మంత్రుల కమిటీ.. ఉద్యోగ సంఘాలతో చర్చించడంతో సమ్మె విరమించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జీవో 28 జారీ చేస్తూ.. 2024 జూన్‌ వరకు హెచ్‌ఆర్‌ఏను 24%గా, గరిష్ఠంగా రూ.25వేలు చెల్లించేందుకు అంగీకరించింది. విధాన నిర్ణయాలు తీసుకునే విచక్షణాధికారం ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ఉద్యోగుల వేతనాల నుంచి రికవరీలు లేకుండా ప్రభుత్వం వేతన సవరణ చేసింది. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని వ్యాజ్యాన్ని కొట్టేయండి’ అని కౌంటర్లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

జగన్ వెయ్యి రోజుల పాలనలో వెయ్యి తప్పులు.. "ప్రజా ఛార్జిషీట్" విడుదల చేసిన తెదేపా

ABOUT THE AUTHOR

...view details