ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రభుత్వ కార్యాలయాలపై సీఎం బొమ్మెందుకు?' - హైకోర్టు తాజా వార్తలు

ప్రభుత్వ కార్యాలయాలపై ముఖ్యమంత్రి చిత్రం ఉంచడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది.  స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. కార్యాలయాలపై సీఎం ఫోటోలు ఉండటం సరికాదంది. వైకాపా, తెదేపా జెండాల ఫోటోలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యాజ్యంపై హైకోర్టులో నేడూ విచారణ కొనసాగనుంది.

high-court-on-pachayath-office-ycp-colors
ప్రభుత్వ కార్యాలయాలపై ముఖ్యమంత్రి చిత్రంపై హైకోర్టు అభ్యంతరం

By

Published : Feb 6, 2020, 6:16 AM IST

ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులపై హైకోర్టు

ప్రభుత్వ కార్యాలయాలపై ముఖ్యమంత్రి జగన్‌ బొమ్మలు ఉంచటంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కార్యాలయం లోపల పెట్టుకుంటే అభ్యంతరం లేదుగానీ, స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కార్యాలయాలపై పెట్టడం సరికాదంది. విచారణలో భాగంగా, వాదనలు వినిపించిన ప్రభుత్వం తరపు న్యాయవాది పంచాయతీరాజ్ కమిషనర్ సూచనల మేరకు కార్యాలయాలకు రంగులేస్తున్నారన్నారని కోర్టుకు వివరించారు. ఆకుపచ్చ, తెలుపు, నీలం రంగులతో పాటు ముఖ్యమంత్రి చిత్రం కూడా ఉండేలా చూస్తున్నారన్నారు. ప్రభుత్వ కార్యాలయాలపై సీఎం చిత్రాన్ని ఎలా పెడుతున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి బదులిస్తూ ప్రభుత్వ తరఫు న్యాయవాది ముఖ్యమంత్రి... రాజ్యాంగపరమైన పదవి, బాధ్యతను నిర్వహిస్తున్నందున ఫొటో ఉంచొచ్చన్నారు. దీనిపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజ్యాంగ బాధ్యత నిర్వహిస్తున్న ప్రధాని చిత్రాన్ని పార్లమెంటుపై, న్యాయమూర్తుల ఫొటోలను కోర్టుల్లో తామెప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రి చిత్రం కార్యాలయాలపై ఉంచితే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లపై ప్రభావం పడుతుందని పేర్కొంది.

పార్టీ రంగులపై వివరణ కోరిన కోర్టు

ప్రభుత్వ కార్యాలయాలపై పార్టీ రంగుల విషయంలో ఏయే చర్యలు చేపట్టారని... రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ప్రశ్నించింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన ఇంకా జారీ చేయలేదని.. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చాకే తమకు అధికారాలు వస్తాయని ఎన్నికల సంఘం బదులిచ్చింది. దీనిపై అదనపు ఏజీ వాదనలు వినిపిస్తారని ప్రభుత్వ న్యాయవాది కోరగా.. అంగీకరిస్తూ విచారణను నేటికి వాయిదా వేసింది.

నేడు విచారణ

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు గ్రామ పంచాయతీ కార్యాలయానికి అధికార వైకాపా జెండా రంగులేయడాన్ని ఆపాలని అభ్యర్థిస్తూ రైతు ముప్పా వెంకటేశ్వరరావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. రంగులేయొద్దని కోర్టు ఆదేశించినా... విజయనగరం జిల్లా లక్కవరపుకోట తలారి గ్రామంలో కార్యాలయానికి రంగులేశారంటూ రమణ మరో వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ల తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ... ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులేసినా తొలగించడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. కోర్టు ఉత్తర్వులను లెక్కచేయకుండా మరికొన్ని చోట్ల రంగులేస్తున్నారని కోర్టుకు వివరించారు. దీనిపై కోర్టులో ఇవాళ కూడా విచారణ కొనసాగనుంది.

ఇదీ చదవండి :మీరు పనిచేస్తేనే ప్రభుత్వ కలల నిజమవుతాయి: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details