ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

NREGS: సర్కారు వద్ద నిధుల్లేవని ఎలా చెబుతారు: హైకోర్టు - అమరావతి వార్తలు

ఉపాధిహామీ పథకం(NREGS) బిల్లుల బకాయిలపై విచారణ జరిపిన హైకోర్టు(HIGH COURT).. ప్రభుత్వ తీరుపై తీవ్రంగా ఆక్షేపించింది. సంక్షేమ పథకాలకు భారీగా వెచ్చిస్తున్నప్పుడు.. చిన్న మెుత్తాలు పెండింగ్​లో పెట్టడంపై ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వ అధికారులను న్యాయస్థానం నిలదీసింది.

HIGH COURT ON NREGS
ఉపాధిహామీ పథకంపై హైకోర్టు

By

Published : Jun 29, 2021, 7:42 AM IST

తాము చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదని ఉపాధిహామీ పథకం(NREGS) గుత్తేదారులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు(HIGH COURT) విచారణ జరిపింది. సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వం గతేడాది రూ.60 వేల కోట్లు ఖర్చు చేసినప్పుడు.. ఉపాధిహామీ పథకం కింద పిటిషనర్లు నిర్వహించిన పనులకు రూ. 20-25 లక్షలు చెల్లించలేకపోయారా ? అని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిని హైకోర్టు ప్రశ్నించింది. సంక్షేమ పథకాలకు భారీగా ఖర్చుచేస్తూ .. రహదారుల నిర్మాణ పనులు చేపట్టిన పిటిషనర్లకు బిల్లులు చెల్లించేందుకు సర్కారు వద్ద నిధుల్లేవని ఎలా చెబుతారని నిలదీసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సోమవారం హైకోర్టు ముందు స్వయంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్.. అధికారులకు పలు ప్రశ్నలు సంధించారు .

సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ ద్వారా బిల్లుల చెల్లింపు జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ట్రెజరరీ శాఖ ద్వారా రెండు వారాల్లో బిల్లులు చెల్లించేవారని, సాంకేతికతను అందిపుచ్చుకొని సీఎఫ్ఎంఎస్ విధానం తెచ్చాక బిల్లుల చెల్లింపునకు రెండేళ్లు పడుతుందని ఆక్షేపించారు. కొత్త విధానం ఏదైనా తీసుకొస్తే పూర్వ పద్ధతులకు భిన్నంగా మెరుగైన సేవలు అందాలని పేర్కొన్నారు. సీఎస్ఎంఎస్ ద్వారా తీవ్ర జాప్యం, సేవాలోపం జరగుతోందన్నారు. ఈ వ్యవహారంపై దృష్టిసారించాలని అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ కు స్పష్టం చేశారు. విశాఖ జిల్లాకు చెందిన 27 ఏడేళ్ల ప్రభుత్వ ఉపాధ్యాయుడు విశ్వనాథం తొమ్మిది నెలలుగా జీతం అందక అనారోగ్యంతో కన్నుమూసిన ఘటనపై ఓ పత్రిక ప్రచురించిన కథనాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. సకాలంలో జీతం చెల్లించకపోవడానికి, ఉపాధ్యాయుడి మరణానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మొదట మానవతావాదులుగా ఉండాలని, ఆ తర్వాతే ఏఐఎస్, ఐపీఎస్ హోదాలని గుర్తు చేశారు. వారం రోజులు మీ జీతాలు జాప్యం అయితే ఊరుకుంటారా ? అని ప్రశ్నించారు. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే సొమ్ము నుంచి జీతాలు తీసుకుంటున్నామన్న విషయాన్ని మరిచిపోకూడదన్నారు. తొమ్మిది నెలలు గడిచినా ఉపాధ్యాయుడు విశ్వనాథానికి జీతం అందలేదని గుర్తుచేశారు. పిటిషనర్లకు బిల్లుల సొమ్ము చెల్లించామని అధికారులు చెప్పడంతో ఆ విషయాన్ని నమోదు చేసిన న్యాయమూర్తి ఓ వ్యాజ్యంపై విచారణను మూసివేశారు. మరో వ్యాజ్యంపై విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ మేరకు ఆదేశాలిచ్చారు.

చిత్తూరు జిల్లా కంభంవారిపల్లె మండలం పరిధిలో సం. 2018 , 2019 లో ఓ రహదారి పనులు నిర్వహించినందుకు రూ .21.41 లక్షల బిల్లుల సొమ్ము చెల్లించడం లేదని పేర్కొంటూ సీకే యర్రంరెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఉపాధి హామీ పథకం కింద పనులు చేసినందుకు రూ.26.39 లక్షలు చెల్లించలేదని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గుత్తేదారు ఆర్.శ్రీనివాసరావు మరో వ్యాజ్యం వేశారు. వీటిపై ఇటీవల జరిగిన విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ .. బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం వద్ద నిధులు లేవని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితికి సంబంధించిన పూర్తి సమాచారంతో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి హైకోర్టుకు స్వయంగా హాజరుకావాలని జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశాలిచ్చారు . ఈ నేపథ్యంలో విచారణకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్ , పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది హాజరయ్యారు. పిటిషనర్లకు చెల్లించాల్సిన బిల్లుల్ని ఈ నెల 25, 26 తేదీల్లో చెల్లించామని కోర్టుకు తెలిపారు . స్వయంగా కోర్టుకు హాజరుకావాలంటూ తాము ఆదేశాలు ఇచ్చేంత వరకు బిల్లుల్ని ఎందుకు చెల్లించలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. సాంకేతికంగా కొన్ని సార్లు జాప్యం జరుగుతోందని ఎస్.ఎస్.రావత్ బదులిచ్చారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. సీఎఫ్ ఎంఎస్ విధానంలో చాలా లోపాలున్నాయన్నారు. సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చుచేసిందని ప్రశ్నించారు. గత ఆర్థిక సంవత్సరం రూ .60 వేల కోట్లు ఖర్చుచేసిందని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రావత్ బదులిచ్చారు. సంక్షేమ పథకాలకు రూ .60 వేల కోట్లు ఖర్చుచేసినప్పుడు.. ప్రభుత్వ ఆర్థిక స్థితి అంత బలహీనంగా ఏమి లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. రూ.60 వేల కోట్లు ఖర్చుచేయడం ప్రశంసనీయం అన్నారు.

విశాఖ జిల్లాలో కన్నుమూసిన ఉపాధ్యాయుడు విశ్వనాథం వార్తా కథనాన్ని గుర్తుచేస్తూ.. సీఎస్ఎంఎస్ ఐడీ సృష్టించకపోవడం వల్ల ఆయనకు జీతం రాలేదన్నారు . ఉద్యోగులను వేధించడం కోసం సీఎఫ్ఎంఎస్ విధానంను తీసుకొచ్చినట్లున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. విశ్వనాథం మరణం ముఖ్యమంత్రిని నిందించడానికి కారణమవుతుంది అన్నారు. అధికారుల తీరువల్లే ప్రభుత్వానికి నిందలు అన్నారు . అధికారుల తీరు దురదృష్టకరం అన్నారు . ప్రభుత్వం తరఫున ఏజీ స్పందిస్తూ.. సీఎఫ్ఎంఎస్ పనితీరుపై వ్యక్తిగతంగా తాను అధికారులతో మాట్లాడి.. సక్రమంగా పనిచేసేలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు . అందుకు కొంత సమయం కావాలన్నారు. వివాదాలు లేని ఉపాధి హామీ పథకం పనుల బిల్లులు చెల్లించేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నామన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details