తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ ఆంక్షలు రేపటితో ముగియనున్నందున.. తదుపరి చర్యలపై రేపు నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కలెక్టర్లు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రేపు సమీక్ష నిర్వహించనున్నారని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిపై అధికారులతో సమీక్షించిన తర్వాత ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు.
తెలంగాణ: కనీసం ఒక రోజు ముందు ప్రజలకు సమాచారం ఇస్తే తప్పేంటి: హైకోర్టు - తెలంగాణ ముఖ్యంశాలు
కరోనా కట్టడిలో భాగంగా విధించిన రాత్రి కర్ఫ్యూ... రేపటితో ముగుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు ఆరాతీసింది. ప్రభుత్వ నిర్ణయం రేపు చెబుతామని తెలపగా... హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రజలకు ఒక రోజు ముందు సమాచారమిస్తే తప్పేంటని వ్యాఖ్యానించింది.
తెలంగాణ హైకోర్టు
ప్రభుత్వ వాదనలు విన్న హైకోర్టు... చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఎందుకని.. కనీసం ఒక రోజు ముందు ప్రజలకు సమాచారం ఇస్తే తప్పేంటని వ్యాఖ్యానించింది. ఆంక్షలు, నియంత్రణా చర్యలపై ఎలాంటి సూచనలు ఇవ్వమని.. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. రేపు మధ్యాహ్నం మళ్లీ విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.