ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నామినేషన్ల దాఖలుకు అవకాశమివ్వాలి.. మున్సిపల్ ఎన్నికలపై వ్యాజ్యాల్లో పిటిషనర్లు - మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ వార్తలు

పుర ఎన్నికలు ఎక్కడి నుంచి ఆగాయో.. తిరిగి అక్కడి నుంచే ప్రారంభించే అధికారం ఎస్​ఈసీకీ లేదంటూ.. మున్సిపల్ ఎన్నికలపై వ్యాజ్యాల్లో పిటిషనర్లు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరారు. కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

high court on muncipal elections
high court on muncipal elections

By

Published : Feb 23, 2021, 4:31 AM IST

పురపాలక ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కణ్నుంచి ప్రారంభించే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్‌ఈసీకి) లేదని న్యాయవాదులు వేదుల వెంకటరమణ, పి.వీరారెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ మేరకు తాజాగా ఎస్‌ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్లను రద్దు చేయాలని కోరారు. తాజాగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి, అర్హులందరూ నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశమిచ్చేలా ఎస్‌ఈసీని ఆదేశించాలని కోరారు. సోమవారం విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలు పూర్తయ్యాయి. ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది వాదనల కోసం విచారణ మంగళవారానికి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు సోమవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు.

పురపాలక, నగరపాలక, నగర పంచాయతీ ఎన్నికల కోసం 2020 మార్చి 9న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇచ్చింది. నామినేషన్ల ఉపసంహరణ దశలో కొవిడ్‌ ముప్పును దృష్టిలో పెట్టుకొని ఎస్‌ఈసీ మార్చి 15న ఎన్నికలను వాయిదా వేసింది. ప్రస్తుతం అనుకూల వాతావరణం ఉన్నందున నిలిచిపోయిన దగ్గర్నుంచి ఎన్నికలు కొనసాగిస్తామని ఈ నెల 15న నోటిఫికేషన్లు ఇచ్చింది. వాటిని సవాలు చేస్తూ కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన యశోద, మధుసూదన్‌ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఎస్‌ఈసీ నిర్ణయంతో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతున్నామంటూ జమ్మలమడుగు నగర పంచాయతీ, తాడిపత్రి పురపాలక సంఘానికి చెందిన పలువురు హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్లు వేశారు.

పోటీ చేసే హక్కును కాదనలేరు
పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘ఈ ఏడాది మార్చి 2న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎస్‌ఈసీ తాజాగా నోటిఫికేషన్‌ ఇచ్చింది. నామినేషన్ల దాఖలుకు తాజాగా అవకాశం ఇవ్వలేదు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ కాలపరిమితి దాటిపోయినందున దానికి కొనసాగింపుగా ఉత్తర్వులివ్వడానికి వీల్లేదు. ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కణ్నుంచి ప్రారంభించాలనే చట్టమే లేదు. నామినేషన్ల దాఖలుకు తుది గడువును ప్రస్తావించకుండా ఎస్‌ఈసీ తాజాగా నోటిఫికేషన్‌ ఇవ్వడానికి వీల్లేదు’ అన్నారు. గత ఎన్నికల ప్రక్రియను కరోనా కారణంగా సస్పెండ్‌ చేశారు కాబట్టి.. కొనసాగింపునకు నోటిఫికేషన్‌ ఇవ్వడాన్ని ఎలా తప్పుబట్టగలమని న్యాయమూర్తి ప్రశ్నించారు.

న్యాయవాదులు బదులిస్తూ.. అధికరణ 243కే ప్రకారం ఎన్నికల ప్రక్రియను పునఃప్రారంభించే అధికారం ఎస్‌ఈసీకి లేదన్నారు. ‘కరోనా కారణంగా ఎన్నికలు వాయిదాపడి సుమారు ఏడాది కావస్తోంది. ఈ మధ్య కాలంలో పలువురు యువత ఎన్నికల్లో పోటీ చేసేందుకు, ఓటేసేందుకు అర్హత సాధించారు. ఆగినచోట నుంచే ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తామనే ఉత్తర్వులు అధికరణ 14, 21ను ఉల్లంఘించేవిగా ఉన్నాయి. దీనివల్ల తాజాగా అర్హత పొందిన పిటిషనర్లు ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని కోల్పోతున్నారు. దేశ చరిత్రలోనే సుమారు ఏడాదిపాటు ఎన్నికలు వాయిదా పడ్డ సందర్భం లేదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని అర్హులందరూ నామినేషన్లు వేసేందుకు అవకాశమిచ్చేలా ఎస్‌ఈసీని ఆదేశించండి’ అని కోరారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం : ఎస్​ఈసీ

ABOUT THE AUTHOR

...view details