ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 29, 2020, 6:41 PM IST

ETV Bharat / city

'రాజధాని రైతులు, మహిళలపై పెట్టిన కేసు వివరాలు సమర్పించండి'

రాజధాని ప్రాంత రైతులు, మహిళలపై దుగ్గిరాల మండలం తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుపై హైకోర్టులో విచారణ జరిగింది. కేసులో వివరాలతో పాటు కేసు డైరీని సమర్పించాలని మంగళగిరి గ్రామీణ పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. దుగ్గిరాల మండలంలోని ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మంగళగిరి మండలం కృష్ణాయపాలెం గ్రామంలోని ప్రభుత్వ, సీఆర్డీఏ భూముల్ని పరిశీలించడానికి రాగా పలువురు అడ్డుకున్నట్లు ఎమ్మార్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

high court on mro complaint  on capital farmers
రాజధాని రైతులపై తహసీల్దార్​ ఫిర్యాదుపై హైకోర్టు

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల తహసీల్దార్ మల్లీశ్వరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాజధాని ప్రాంత రైతులు, మహిళలపై నమోదు చేసిన కేసులో వివరాలతో పాటు కేసు డైరీని సమర్పించాలని మంగళగిరి గ్రామీణ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 2కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూ.దుర్గాప్రసాదరావు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

దుగ్గిరాల మండలంలోని ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మంగళగిరి మండలం కృష్ణాయపాలెం గ్రామంలోని ప్రభుత్వ, సీఆర్డీఏ భూముల్ని పరిశీలించడానికి రాగా పలువురు అడ్డుకున్నట్లు తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని రైతులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. శుక్రవారం జరిగిన విచారణలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భూముల సర్వేకు తహసీల్దార్ వచ్చారేమోనని న్యాయమూర్తి సందేహం వెలిబుచ్చారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది బదులిస్తూ ఉన్నతాధికారుల్ని తాము విచారించగా అనుమతి ఇవ్వలేదని తెలిపారన్నారు.

తహసీల్దార్ తన ఫిర్యాదులో 25 మంది రైతుల పేర్లను ప్రస్తావించారని.. ఈ వ్యవహారం వెనుక దురుద్దేశం ఉందన్నారు. ఈ కేసు విషయంలో తదుపరి చర్యలను నిలువరిస్తూ పోలీసులను ఆదేశించాలన్నారు. ఆ అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వ న్యాయవాది స్వల్ప గడువు కోరడం వల్ల విచారణ వాయిదా పడింది.

ఇదీ చదవండి:

'చంద్రబాబుపై కుట్రతో యాత్రను అడ్డుకున్నారు'

ABOUT THE AUTHOR

...view details