జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టులో విచారణ సాగింది. పరిషత్ ఎన్నికల వ్యవహారంపై హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో.. ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే ఎన్నికల నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఆదేశాలను నిలుపుదల చేసింది. అయితే ఈ ఎన్నికలు రద్దు చేస్తూ.. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు మాత్రం యథాతథంగా అమల్లోనే ఉండనున్నాయి. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన అప్పీలను పరిష్కరించే వరకూ ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనను నిలుపుదల చేస్తూ హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 8న జరిన పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ మే 21న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ఎన్నికల సంఘం హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీలు చేసింది.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలు
పరిషత్ ఎన్నికల వ్యవహారంపై హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడ నుంచి ఎన్నికలు ఆగాయో.. అక్కడి నుంచే తిరిగి ప్రారంభించాలన్న సింగిల్ జడ్జి తీర్పుపై అమలును నిలుపుదల చేసింది. అయితే ఈ ఎన్నికలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు మాత్రం యథాతథంగా ఉండనున్నాయి.
ఈ వ్యవహారంలో రికార్డులు పరిశీలించి లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అప్పీలుపై అత్యవసరంగా తుది విచారణ చేపట్టాలని కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన బ్యాలెట్ పెట్టెలు తిరిగి పంపాల్సి ఉందన్నారు. అనంతరం ధర్మాసనం విచారణను జులై 27కు వాయిదా వేసింది. ఎస్‌ఈసీ అప్పీలులో ప్రతివాదులుగా ఉన్న జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌కు తాఖీదులు జారీ చేసింది.
ఇదీ చదవండి:NGT: రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణంలో ఏపీ తీరుపై ఎన్జీటీ ఆగ్రహం