మంగళగిరి , తాడేపల్లి మున్సిపాలిటీలను విలీనం చేసి 'మున్సిపల్ కార్పొరేషన్' ఏర్పాటుచేయడంపై.. ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కమిషనర్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. గ్రామాల విలీనంపై ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలతో కలిపి ఈ పిటిషన్‌ను విచారిస్తామని తెలిపింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టంచేసింది. మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ ఏర్పాటుచేస్తూ పురపాలకశాఖ ఇచ్చిన జీవో 19ని సవాలు చేస్తూ.. తాడేపల్లి మండలం చిర్రావూరుకు చెందిన సామాజిక కార్యకర్త ఎస్.లాల్‌చంద్‌తోపాటు మరో ముగ్గురు హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
తాడేపల్లి మున్సిపాలిటీలో రాజధాని ప్రాంతంలోని 8 గ్రామాల విలీనానికి ప్రభుత్వం ఇచ్చిన జీవోపై గతంలో హైకోర్టు స్టే ఇచ్చిందని.. పిటిషనర్ తరపు న్యాయవాది వాసిరెడ్డి ప్రభునాథ్ గుర్తుచేశారు. ఆ తర్వాత సమీప మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనానికి ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందన్నారు. దానిని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు హైకోర్టులో పెండింగ్ లో ఉండగా.. ప్రభుత్వం హడావుడిగా జీవో 19 తెచ్చిందని ధర్మాసనానికి నివేదించారు. ప్రభుత్వం తరఫున కాసా జగన్మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు.