కాపు నేస్తం కింద ఐదేళ్లపాటు అర్హులకు ఆర్థిక సాయం తరహాలోనే ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్గాలకు చెందిన మహిళలకు ఈబీసీ నేస్తం పథకం కింద ఆర్థిక సాయం అందించాలని కోరుతూ.. హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు ఈబీసీ నేస్తం పథకం మూడేళ్లు మాత్రమే వర్తింపచేయడం, ఇప్పటికీ పథక ప్రయోజనాలు కల్పించడకోవడాన్ని సవాలు చేస్తూ.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన కేఎల్ అవినాశ్ పిల్ చేశారు. పథక ప్రయోజనాలను కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం కులం ప్రాతిపదికన వివక్ష చూపుతోందన్నారు. ఐదేళ్లపాటు ప్రయోజనాలు కల్పించకపోతే సుమారు నాలుగు లక్షల మంది ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్గాల ప్రజలు ప్రభావితం అవుతారన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాది వి.రఘు వాదనలు వినిపించారు.
అ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.