నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకంపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్(high court on houses scheme)పై విచారణ ఈనెల 26కి వాయిదా పడింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు ధ్రువీకరణ(సర్టిఫైడ్) ప్రతిని దాఖలు చేయాలని ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
ఇళ్లు పథకంలోని లోపాల్ని ఎత్తి చూపిన హైకోర్టు సింగిల్ జడ్జి.. వాటిపై నిపుణుల కమిటీ అధ్యయనం చేసేంత వరకు స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టవద్దంటూ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తీర్పుపై ప్రభుత్వం అప్పీల్ వేసింది. అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. వ్యాజ్యంలో పిటిషనర్ లేవనెత్తని పలు అంశాల్ని సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకున్నారు. సెంటు, సెంటున్నర స్థలంలో ఇళ్లు నిర్మాణం సరిపోదన్నారు. మా ప్రభుత్వానికి బంగళాలను కట్టాలని ఉన్నా.. పీఎంఏవై పథకం నిబంధనలు అందుకు అంగీకరించవు. ఈ వ్యవహారానికి సంబంధించిన జీవోలపై విచారణ.. విస్తృత ధర్మాసనం ముందు ఉన్నప్పటికీ సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుతో పీఎంఏవై పథకం కింద నిర్మించే లక్షల ఇళ్ల నిర్మాణ ప్రక్రియ నిలిచిందన్నారు.