రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలంసాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారణలో భాగంగా.. సలహాదారులపై హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, సలహాదారుల నియామక విధానం, వారికి అప్పగించిన విధుల స్వభావం ఏంటని ప్రశ్నించింది. విధుల నిబంధనలు, విధివిధానాలేంటో అదనపు అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొంతమంది సలహాదారులు రాజకీయ అంశాలనూ మీడియాతో మాట్లాడటంపై తప్పుబట్టింది. ఇది చట్ట వ్యతిరేకం కాదా అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. సలహాదారులకు అప్పగించిన విధులను పరిశీలించాలని భావిస్తున్నట్లు స్పష్టంచేసింది. అన్నిశాఖలకు మంత్రులు ఉండగా.. ప్రభుత్వ కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సలహాదారులు సమీక్ష సమావేశాలు నిర్వహించవచ్చా అని సందేహం వ్యక్తంచేసింది.
2020 డిసెంబర్ 31న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలంసాహ్ని పదవీ విరమణ చేయగా.. డిసెంబర్ 22నే ఆమె ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారని హైకోర్టు గుర్తుచేసింది. 2021 మార్చి 27న సలహాదారు పదవికి రాజీనామా చేశారని.. మార్చి 24నే ఎస్‌ఈసీ నియామకంపై గవర్నర్‌కు పంపిన మూడు పేర్లలో సాహ్ని పేరున్న విషయం ప్రస్తావించింది. గవర్నర్ ముఖ్యకార్యదర్శి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సీవీ.మోహన్‌రెడ్డిని ఉద్దేశించి.. మీరు అడ్వకేట్ జనరల్‌గా పనిచేసినప్పుడు ప్రభుత్వ, రాజకీయ విషయాల్ని సలహాదారులు మీడియాతో మాట్లాడటం, పత్రికా సమావేశాలు నిర్వహించడం గమనించారా అని ప్రశ్నించింది. అప్పట్లో అలా లేదని ఆయన బదులిచ్చారు. ముఖ్యమంత్రి నిర్ణయాల్లో సలహాదారులు సహాయ సహకారాలు అందిస్తారన్నారు. తమకు అప్పగించిన అంశాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించవచ్చని కోర్టుకు వివరించారు. ఈ వివరణపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్.. ప్రభుత్వంతోపాటు ముఖ్యమంత్రి సలహాదారుల విధులు, నియామక విధివిధానాలను కోర్టుముందు ఉంచాలని ఆదేశించారు. విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు.