ఆధార్ కార్డులు లేకపోయినా అన్ని వృద్ధాశ్రమాల్లో కొవిడ్ టీకా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఆధార్ కార్డుల్లేని వృద్ధులకు టీకా నిరాకరించడంపై ఈ నెల 8న ‘ఈనాడు’ ప్రధాన పత్రికలో ప్రచురితమైన ‘ఆధార్ లేదు.. టీకా అందదు’ కథనం ఆధారంగా విచారణ చేయిస్తామని, సంబంధిత సంయుక్త కలెక్టర్లను నివేదికలు కోరతామని తెలిపింది. టీకా నిరాకరణ నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సుమన్ చెప్పారు. కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోని వృద్ధాశ్రమాల్లో ఉన్నవారందరికీ ఇప్పటికే టీకాలు వేశామన్నారు. మిగిలిన జిల్లాల్లో 50 శాతం పూర్తయిందన్నారు. వీరందరికీ కూడా రెండు రోజుల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. గుర్తింపుకార్డులు లేకపోయినా వృద్ధులకు టీకా వేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నా.. వ్యాక్సిన్ వేసే సిబ్బందికి తెలియాలి కదా అని వ్యాఖ్యానించింది. దీనిపై సిబ్బందికి రాతపూర్వకంగా ఆదేశాలివ్వాలని చెప్పింది.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, అనంతపురం జిల్లా నార్సింగ్‌పల్లి, కడప జిల్లా కాశినాయన మండలంలోని వృద్ధాశ్రమాల్లో వృద్ధులకు ఆధార్ లేదని టీకా నిరాకరించారన్న ‘ఈనాడు’ కథనం ఆధారంగా జరిపిన విచారణ వివరాల్ని కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.విజయలక్ష్మి, జస్టిస్ డి.రమేశ్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కార్పొరేట్ ఆసుపత్రులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని కరోనా చికిత్స అందించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుంకర రాజేంద్రప్రసాద్, కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పాత్రికేయులు తోట సురేశ్‌బాబు, ఏపీ పౌరహక్కుల సంఘం (ఏపీసీఎల్‌ఏ) సంయుక్త కార్యదర్శి బి.మోహన్‌రావు తదితరులు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు వేసిన విషయం తెలిసిందే. వీటిపై గురువారం విచారణ జరిగింది.
80 ఏళ్ల వృద్ధులు ఎక్కడికెళ్లాలి?
సీనియర్ న్యాయవాది, అమికస్‌క్యూరీ వైవీ రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఆధార్ కార్డు లేని కారణంగా వృద్ధాశ్రమాల్లో టీకా నిరాకరణపై ‘ఈనాడు’ కథనాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. టీకా విషయంలో వృద్ధులకు ప్రాధాన్యమివ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. గుర్తింపుకార్డులతో నిమిత్తం లేకుండా దేశంలోని పలు రాష్ట్రాలు వృద్ధులకు వ్యాక్సిన్ వేశాయన్నారు. ఆధార్ కార్డు లేదన్న కారణంతో ఏపీలో టీకా నిరాకరించడమేమిటని ప్రశ్నించారు. 80, 85 ఏళ్ల వయసులో ఆధార్‌కార్డు కోసం వృద్ధులు ఎక్కడికి వెళ్లాలన్నారు. ఎస్‌జీపీ స్పందిస్తూ.. వృద్ధాశ్రమాలు, పునరావాస కేంద్రాలు, జైళ్లలో ఉండేవారు, అస్థిరవాసులకు ఎలాంటి గుర్తింపుకార్డు లేకపోయినా టీకా ఇవ్వాలన్న కేంద్ర మార్గదర్శకాలను తప్పక పాటిస్తామని చెప్పారు.
ప్రభుత్వం కొవిడ్ పరీక్షలను పెంచేలా ఆదేశాలు జారీ చేయాలని అమికస్‌క్యూరీ కోర్టును అభ్యర్థించారు. ఎస్‌జీపీ బదులిస్తూ.. ‘పరీక్షలు భారీ సంఖ్యలో నిర్వహిస్తున్నాం. ఈ నెల 9న 98 వేల పరీక్షలు చేశాం. కరోనాను ఎదుర్కొవడానికి తాత్కాలిక ప్రాతిపదికన వైద్య సిబ్బందిని పెంచాం. 26,325 మంది వైద్య, ఇతర సిబ్బందిని అదనంగా నియమించాం. ప్రస్తుత అవసరాలకు సరిపడిన సిబ్బంది ఉన్నారు. కొవిడ్ చికిత్సలో భాగస్వాములైన పారామెడికల్ సిబ్బంది, నర్సులు, చివరి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాం’ అని చెప్పారు. ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో వైద్య సిబ్బంది, నర్సులకు జీతాలు, పారితోషికం చెల్లించడం లేదని న్యాయవాదులు పొత్తూరి సురేశ్‌కుమార్, నర్రా శ్రీనివాసరావు తదితరులు చెప్పగా ఎస్‌జీపీ విభేదించారు. దీంతో ఎవరికి జీతాలివ్వడం లేదో తెలియజేస్తూ మెమో వేయాలని ధర్మాసనం పిటిషనర్లకు సూచించింది.