ఆంక్షల పేరుతో విజయవాడలోని బహుళ అంతస్తుల కోర్టు భవన నిర్మాణ పనుల్ని పోలీసులు, అధికారులు అడ్డుకోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. అక్కడ అంత ఇబ్బంది ఉంటే కోర్టునే మూసేయాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. విజయవాడలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా న్యాయస్థానాల భవనాలు, నిర్మాణ పరిస్థితి దారుణంగా ఉందంది. ఈ అంశంపై పలు ఫిర్యాదులు అందాయని తెలిపింది. కోర్టు భవనాల నిర్మాణంలో జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదో కారణాన్ని చూపుతోందని అసహనం వ్యక్తంచేసింది. న్యాయస్థానాలు రాష్ట్రానికి సంబంధించినవని, వాటిని మీ కోసం సిద్ధం చేసుకోవాలని హితవు పలికింది. అంతిమంగా మీ(రాష్ట్ర) ఇష్టం అంది. విజయవాడ కోర్టు భవన నిర్మాణాన్ని అడ్డంకుల్లేకుండా ఏవిధంగా కొనసాగిస్తారో తెలుపుతూ అఫిడవిట్ వేయాలని రహదారులు, భవనాల శాఖ, పోలీసుశాఖను ఆదేశించింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
అసౌకర్యం అనే కారణంతో..
గవర్నర్ బంగళా పక్కనే ఉండటం, ఇరుగుపొరుగుకు అసౌకర్యం అనే కారణంతో విజయవాడలోని బహుళ అంతస్తుల కోర్టు భవన సముదాయ నిర్మాణ పనుల్ని పోలీసులు, ఇతర అధికారులు అడ్డుకుంటున్నారని గుత్తేదారు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై మంగళవారం జరిగిన విచారణలో గుత్తేదారు తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ఉదయం వేళల్లో కాంక్రీట్ మోసుకొచ్చే వాహనాలను ఆంక్షల పేరుతో రానివ్వడం లేదన్నారు. ఇలాగైతే హైకోర్టుకు హామీ ఇచ్చిన గడువు(మే నెలాఖరు)లోపు భవనాన్ని నిర్మించి అప్పగించడం సాధ్యంకాదని తెలిపారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్‌ను వివరణ కోరింది. ట్రాఫిక్ ఇబ్బందులు, ఇతర ఆంక్షల కారణంగా వాహనాలను అనుమతించడం లేదని ఆయన తెలిపారు. దీంతో అసంతృప్తి వ్యక్తంచేసిన ధర్మాసనం.. ఇబ్బంది ఉంటే కోర్టునే మూసేయండి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.