‘క్రైస్తవ మతాన్ని ఆచరించే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు తిరుమల వెళ్లిన సందర్భంలో చట్ట నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వనందున ఆయన్ను ఆ పదవిలో కొనసాగకుండా నియంత్రించాల’ని కోరుతూ వేసిన కో వారెంటో రిట్ పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. జగన్‌మోహన్‌రెడ్డి క్రైస్తవుడని నిరూపించేందుకు తగిన ఆధారాలు సమర్పించనందున దీన్ని కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ బుధవారం తీర్పు వెలువరించారు.
సీఎం హోదాలో వెళ్లినందున డిక్లరేషన్ అవసరం లేదు: హైకోర్టు
తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వెళ్లిన సమయంలో డిక్లరేషన్ ఇవ్వని సీఎం జగన్‌ను....పదవిలో కొనసాగకుండా నియంత్రించాలన్న వ్యాజ్యాన్ని....హైకోర్టు కొట్టేసింది. సంబంధిత వ్యాజ్యంలో....ముఖ్యమంత్రి క్రైస్తవ మతాన్ని ఆచరిస్తారని....పిటిషనర్ పేర్కొన్నారు.
శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల వెళ్లిన ముఖ్యమంత్రి.. తనకు స్వామి వారి పట్ల విశ్వాసం ఉందని తెలుపుతూ డిక్లరేషన్ ఇవ్వలేదని, మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని దానికి వంత పాడారని, అధికారులు కూడా అలక్ష్యం వహించారంటూ గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురానికి చెందిన ఏ.సుధాకర్‌బాబు హైకోర్టును ఆశ్రయించారు. వెలంపల్లి శ్రీనివాస్, కొడాలి నానితో పాటు తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, అప్పటి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌లు ఆ పోస్టుల్లో కొనసాగకుండా నియంత్రించాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు... క్రైస్తవ సువార్త సమావేశా(గాస్పెల్ కన్వెన్షన్)లకు, చర్చిలో ప్రార్థనలకు హాజరైనంత మాత్రాన ఒక వ్యక్తిని క్రైస్తవుడిగా పరిగణించలేమని పేర్కొంది. జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల విజయవాడలోని గురుద్వారాలో నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారని.. అంతమాత్రాన ఆయన సిక్కు మతాన్ని అనుసరిస్తున్నట్లు భావించాలా? అని ప్రశ్నించింది. చర్చి ప్రార్థనల్లో పాల్గొనటం, బైబిల్‌కు సంబంధించిన పేరు కలిగి ఉండటం, ఇంట్లో శిలువ ఉన్నంత మాత్రాన వారిని క్రైస్తవులుగా పరిగణించాలా? అంటే లేదనే చెప్పాలని వ్యాఖ్యానించింది. తితిదే ఆహ్వానం మేరకు రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా ముఖ్యమంత్రి హోదాలో పట్టువస్త్రాలు సమర్పించేందుకు జగన్ తిరుమల వెళ్లినందున డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. ఎవరైనా హైందవేతరులు వ్యక్తిగత హోదాలో శ్రీవారి ఆలయానికి వెళ్లినప్పుడు మాత్రమే 136వ నియమం కింద డిక్లరేషన్ సమర్పించాలని పేర్కొంది.
ఇదీ చదవండి:'న్యాయమూర్తుల బదిలీలతో ఆయనపై కేసుల విచారణలో జాప్యం జరగొచ్చు'