ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఐడీ కేసులో నారాయణ బెయిల్​ పిటిషన్​పై నేడు విచారణ - narayana bail petition over cid case

High Court on Narayana Bail Petition: రాజధాని బృహత్ ప్రణాళిక, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం అంగుళం భూమి కూడా సేకరించనప్పుడు... అనుచిత లబ్ధి జరిగిందనే ప్రశ్నే తలెత్తదని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీకార ఎజెండాతో రాజకీయ ప్రత్యర్థులను క్రిమినల్‌ కేసుల్లో ఇరికించి వేధింపులకు గురి చేస్తోందన్నారు. అందులో భాగంగానే తనపై సీఐడీ తప్పుడు కేసు నమోదు చేసిందన్నారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది.

High Court On CID Case over Narayana Bail petition
High Court On CID Case over Narayana Bail petition

By

Published : May 19, 2022, 4:41 AM IST

‘ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు అంగుళం భూమి కూడా సేకరించలేదు. అలాంటప్పుడు అనుచిత లబ్ధి ప్రశ్నే తలెత్తదు’ అని మాజీ మంత్రి పొంగూరు నారాయణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజధాని అమరావతికి చెందిన బృహత్‌ ప్రణాళిక డిజైనింగ్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు కోసం ఆయన ఈ పిటిషన్‌ వేశారు. ‘రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకార ఎజెండాతో రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్‌ కేసుల్లో ఇరికించి వేధింపులకు గురి చేస్తోంది. వారిని జైలుకు పంపి ప్రజల్లో ప్రతిష్ఠను దిగజారుస్తోంది. అందులో భాగంగానే నాపై సీఐడీ తప్పుడు కేసు నమోదు చేసింది. పాలక ప్రభుత్వం పగ తీర్చుకోవడంలో భాగంగా వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు. ఇదే కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ లింగమనేని రమేష్‌, రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ కె.పి.వి.అంజనీకుమార్‌ వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.మన్మథరావు వీటిపై ఇవాళ(గురువారం) విచారణ జరపనున్నారు.

నేపథ్యమిదే.. :అమరావతి బృహత్‌ ప్రణాళిక డిజైనింగ్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, దానిని అనుసంధానించే రహదారుల అలైన్‌మెంట్‌ విషయమై అక్రమాలు, అవినీతి చోటుచేసుకున్నాయని మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ ఏడాది ఏప్రిల్‌ 27న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మే 9న సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది. ఐపీసీ 120(బి), 420, 34,35,36,37,166, 167, 217, అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 13(2)రెడ్‌విత్‌ 13(1)(ఎ) సెక్షన్ల కింద అభియోగాలు మోపింది. తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి నారాయణ, మరికొందరిని నిందితులుగా పేర్కొన్న విషయం విదితమే.

అనుమానం, ఊహాజనిత కారణాలతో చేసిన ఫిర్యాదు ఇది.. :‘అమరావతి కోసం తలపెట్టిన ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును 2019లో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేసింది. 2020 నుంచే అమరావతి బృహత్తర ప్రణాళికను బుట్టదాఖలు చేసింది. ఒక్క అంగుళం భూసేకరణ జరగలేదు. అలాంటప్పుడు ఈ వ్యవహారంలో కొందరికి అనుచిత ప్రయోజనం కల్పించారనే ప్రశ్న తలెత్తదు. వేధించడం కోసం, గౌరవ మర్యాదలు, ప్రతిష్ఠను దిగజార్చాలని వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నాపై ఫిర్యాదు చేశారు. ఓ హౌసింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థలో సంబంధాలున్నాయని ఆరోపణ చేశారు. నాకు, కుటుంబ సభ్యులకు ఆ హౌసింగ్‌ సంస్థతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు. అనుమానం, ఊహాజనిత కారణాలతో చేసిన ఫిర్యాదు ఇది. మాస్టర్‌ ప్లాను సిద్ధం చేసే పనిని సీఆర్‌డీఏ 2015 ఆగస్టులో సింగపూర్‌కు చెందిన సుర్బానా- జురాంగ్‌ సంస్థకు అప్పగించింది. దీనిపై ఫిర్యాదుదారు ఇప్పుడు ఫిర్యాదు చేశారు. సుమారు 6 ఏళ్ల 8 నెలల అసాధారణ జాప్యం ఉంది. ఫిర్యాదులో జాప్యానికి కారణం ఏమిటో చెప్పకుండా మాపై ఆరోపణలు చేస్తున్నారు. ఏ ఒక్కరికీ ఈ విషయంలో దురుద్దేశాలు ఆపాదించడానికి వీల్లేదు. నేరపూర్వక బాధ్యులుగా పేర్కొనడం సరికాదు.

రాజధాని వ్యవహారంలో సీఆర్‌డీఏ చట్టం నిబంధనల మేరకు సమష్టిగా తీసుకున్న నిర్ణయాలు, చర్యలకు ప్రభుత్వానికి, అధికారులకు ఆ చట్టంలోని సెక్షన్‌ 146 ప్రకారం ప్రాసిక్యూషన్‌ నుంచి రక్షణ ఉంది. విచారించడానికి వీలు లేకుండా నిషేధం ఉంది. ఐపీసీ సెక్షన్‌ 420 కింద నాపై కేసు నమోదు చెల్లుబాటు కాదు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారు ఏ ఒక్కరినైనా మోసగించడానికి ప్రయత్నించారని ఫిర్యాదుదారుడు పేర్కొనలేదు. ప్రాపర్టీ స్వాధీనం చేసుకోనప్పుడు మోసపూరితంగా పరిగణించలేమని న్యాయ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. నిందితులు చట్ట విరుద్ధమైన ప్రతిఫలం పొందారని ఫిర్యాదుదారుడు పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చెల్లదు. ఫిర్యాదుదారు చేసిన ఆరోపణలు నిర్దిష్టమైనవి కావు. అపఖ్యాతి పాల్జేయాలని దురుద్దేశంతో నిందారోపణలు చేస్తున్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందస్తు బెయిలు మంజూరు చేయండి...’ అని మాజీ మంత్రి నారాయణ కోరారు.

ఇదీ చదవండి:టెన్త్​ ప్రశ్నపత్రం లీకేజీ కేసు.. విచారణ నేటికి వాయిదా

ABOUT THE AUTHOR

...view details