బిగ్‌బాస్ లాంటి రియాల్టీ షోలతో యువత పెడదారిపడుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి షోలతో సమాజంలో ప్రమాదకర పోకడలు పెరుగుతున్నాయని తెలిపింది. సమాజంతో తమకు సంబంధం లేదన్నట్లు ఉంటే ఎలా? అని ప్రశ్నించింది. అభ్యంతరకర షోల విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. బిగ్‌బాస్ షోను నిలిపేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై సోమవారం విచారణ చేస్తామని స్పష్టంచేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ టి.రాజశేఖరరావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది.
అశ్లీలత, అసభ్యతను ప్రోత్సహించేదిగా బిగ్‌బాస్ షో ఉందని పేర్కొంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 2019లో హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరఫున న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని శుక్రవారం ధర్మాసనం ముందు ప్రస్తావించారు. బిగ్‌బాస్ షో వల్ల యువత తప్పుదోవ పడుతోందన్నారు.