ఏపీ యూనివర్సిటీల(రెండో సవరణ) చట్టం -2019 చేసే అధికారం రాష్ట్ర శానస వ్యవస్థకు లేదని పేర్కొంటూ విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ అల్లు చిన్ననారాయణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై గురువారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. యూజీసీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. ఈ లోపు చేపట్టే ఉపకులపతుల(వీసీ) నియామకాలు కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ డి.రమేశ్ తో కూడిన ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
వర్సిటీల సవరణ చట్టంపై యూజీసీ, కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు - ఏపీ యూనివర్సిటీల చట్టం-2019 న్యూస్
ఏపీ యూనివర్సిటీల(రెండో సవరణ) చట్టం-2019ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యాజ్యంలో పూర్తి వివరాలతో రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కార్యదర్శికి నోటీసులు జారీచేసింది. రెండు వారాల తర్వాత మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశంపై విచారణ చేస్తామని స్పష్టం చేసింది.
పిటిషనర్ తరఫు.. న్యాయవాది సువ్వారి శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ.. వీసీల నియామకం విషయంలో ప్రభుత్వ సిఫారసుల మేరకు... అనే పదాలను సవరణ చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం చేర్చిందన్నారు. రాజకీయ కారణాలతో వీసీల పేర్లు సిఫారసు చేయడం కోసం ప్రభుత్వం సవరణ చట్టం చేసిందన్నారు. వాస్తవానికి వీసీల నియామకం విషయంలో ప్రభుత్వ పాత్ర ఉండదన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ .. చట్టం చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు గడువు కోరారు. ఇరువైపులా వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది.