HIGH COURT: రాష్ట్ర విత్తనాభివృద్ధి కార్పోరేషన్ డైరెక్టర్ల ఎన్నిక నోటిఫికేషన్ను హైకోర్టు రద్దు చేసింది. విత్తన ఉత్పత్తిదారుల భాగస్వామ్యుల వాటా కింద మూడు డైరెక్టర్ల పోస్టులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. రెండు పోస్టులకు మాత్రమే ఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వడాన్ని తప్పుపట్టింది. మరోవైపు డైరెక్టర్ పోస్టుకు మూడేళ్ల పదవీకాలం ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 22 నెలలుగా మాత్రమే నిర్ణయించడాన్ని ఆక్షేపించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.
రెండు డైరెక్టర్ల పోస్టుల ఎన్నికకు ఏపీ రాష్ట్ర విత్తనాభివృద్ధి కార్పోరేషన్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్.. ఈ ఏడాది నవంబర్ 5న నోటిఫికేషన్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ వ్యవసాయదారుడు, విత్తనాభివృద్ధి సంస్థలో భాగస్వామి నరసింహారావు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపు సీనియర్ న్యాయవాది ఎ. సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల నోటిఫికేషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నారు. కనీసం పత్రికలో ప్రకటన ఇవ్వలేదన్నారు. పదవీకాలాన్ని మూడేళ్ల నుంచి 22 నెలలకు కుదించినట్లు తెలిపారు. విత్తన ఉత్పత్తిదారుల భాగస్వామ్య వాటా కింద మూడు డైరెక్టర్ పోస్టులను ఎన్నుకోవాల్సి ఉందన్నారు. నిబంధనలకు విరుంగా ఉన్న ఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేయాలని కోరారు. దస్త్రాలను పరిశీలించిన న్యాయమూర్తి నోటిఫికేషన్, తదనంతరం ప్రక్రియను రద్దు చేశారు.