ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 29, 2022, 8:03 AM IST

ETV Bharat / city

'ఆ నిర్ణయం.. ప్రైవేటు సంస్థల వ్యాపారాన్ని దెబ్బ తీసేలా ఉంది'

MOVIE TICKETS : సినిమా టికెట్లను ఆన్​లైన్​ ద్వారా ప్రభుత్వమే విక్రయించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన సవరణ చట్టం, తదనంతరం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వ నిర్ణయం ప్రైవేట్ సంస్థల వ్యాపారాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

MOVIE TICKETS
MOVIE TICKETS

MOVIE TICKETS: ప్రభుత్వ ఆన్‌లైన్‌ వేదిక ద్వారానే సినిమా టికెట్లను విక్రయించాలనడం సరికాదని ‘బుక్‌ మై షో’ తరఫు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ నిర్ణయం ప్రైవేటు సంస్థల వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. ప్రభుత్వం నేరుగా ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తే అభ్యంతరం లేదని, తమను కూడా ఏపీ స్టేట్‌ ఫిల్మ్‌ టెలివిజన్‌ థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ రూపొందించే వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లు విక్రయించాలనడం సరికాదని పేర్కొన్నారు. ప్రతి టికెట్‌పై రూ.2 సర్వీసు ట్యాక్‌ వసూలుకు నిర్ణయించడం, మరోవైపు తమ వేదికనే అనుసంధానం చేసుకోవాలనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సరైన వ్యవస్థ లేకుండానే ప్రభుత్వం ఆన్‌లైన్‌ విక్రయాలకు తెర తీసిందని అన్నారు. విక్రయ బాధ్యతలను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించనుందని, ఈ నిర్ణయం గుత్తాధిపత్యానికి దారి తీస్తుందని వాదించారు. సమస్యలను పరిగణనలోకి తీసుకొని జులై 2నుంచి అమల్లోకి వచ్చే ఆన్‌లైన్‌ టికెట్‌ విక్రయ ప్రక్రియను నిలువరించాలని కోరారు. సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో ప్రభుత్వమే విక్రయించేలా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది తెచ్చిన సవరణ చట్టం, తదనంతర ఉత్తర్వులను సవాలుచేస్తూ హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలైంది. బిగ్‌ట్రీ ఎంటర్‌టైన్‌మెంట్‌ (బుక్‌ మై షో) ప్రైవేట్‌ లిమిటెడ్‌, దాని డీజీఎం సందీప్‌ అన్నోజ్‌వాలా హైకోర్టును ఆశ్రయించారు.

ధరల నియంత్రణకే నిర్ణయం:ప్రభుత్వ నిర్ణయంతో టికెట్‌ విక్రయాల్లో పారదర్శకత పెరుగుతుందని, అధిక ధరలకు కళ్లెం పడుతుందని అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ వివరించారు. ‘బుక్‌ మై షో’ యథావిధిగా కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని, ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ వెబ్‌సైట్‌తో అనుసంధానమై టికెట్లు విక్రయించుకోవచ్చని అన్నారు. ‘బుక్‌ మై షో’ ప్రతి టికెట్‌పై 14నుంచి 17శాతం కన్వేయన్స్‌ ఛార్జి వసూలుచేస్తోందని తెలిపారు. ప్రభుత్వ కొత్త విధానాన్ని కొంతకాలం పరిశీలించాలని, ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులివ్వవద్దని కోరారు. సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు వీలుగా తెచ్చిన సవరణ చట్టాన్ని సవాలుచేస్తూ ‘మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ తరఫున మంజీత్‌సింగ్‌ తదితరులు వేసిన వ్యాజ్యంపైనా హైకోర్టు విచారించింది. సమయం సరిపోకపోవడంతో విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details