ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భక్తులకు శ్రీవారి దర్శనంలో తితిదే తీరుపై హైకోర్టు ఆక్షేపణ - శ్రీవారి ఆలయం

High Court on TTD: భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించే విషయంలో తితిదే అనుసరిస్తున్న తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. శ్రీవెంకటేశ్వరస్వామి వారి సేవ కోసం మేల్ చాట్ వస్త్ర సేవ, ఆర్జిత సేవల కోసం 14 ఏళ్ల కిందట భక్తులు బుక్ చేసుకున్న టికెట్లను కొవిడ్ కారణం చెప్పి రద్దు చేయడాన్ని తప్పుపట్టింది. 'గతంలో టికెట్లు పొందిన భక్తులకు కొవిడ్ తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాక కూడా వారికే ఆర్జిత సేవలు కల్పిస్తే.. దేవస్థానానికి కొత్తగా, అధికంగా ఆదాయం పొందలేదు. ఆ కారణం చేతనే.. ఆన్​లైన్​ ద్వారా కొత్తవారు టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ వారి నుంచి భారీగా సొమ్ము వసూలు చేస్తోంది. ఇలాంటి వ్యవహార శైలి .. భక్తుల భావోద్వేగాలను (ఎమోషన్స్) సొమ్ము చేసుకోవడమే. భక్తుల మనోభావలను గౌరవించడం కంటే ఎక్కువ వ్యాపార ధోరణికే (కమర్షియల్ ) దేవస్థానం ప్రాధాన్యత ఇస్తునట్లు కనిపిస్తోంది' అని తితిదే తీరుపై తీవ్రంగా స్పందించింది.

high court
high court

By

Published : Sep 25, 2022, 10:18 AM IST

High Court on TTD: పిటిషనర్లు పూర్వం కోరుకున్న విధంగానే స్వామివారికి ఆర్జితసేవ అందించేందుకు అనుమతి ఇవ్వాలని తితిదే అధికారులను ఆదేశించింది. పిటిషనర్లకు, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అనుకూలమైన తేదీ, సమయాలను ముందుగా చర్చించి ఖరారు చేసుకోవాలని తెలిపింది. ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

శ్రీవెంకటేశ్వరస్వామి వారికి మేల్చాట్ వస్త్ర సేవ నిమిత్తం 2007 జులైలో (14 ఏళ్ల కిందట) ఈ - టికెట్ బుక్ చేసుకున్న తనకు కొవిడ్ మార్గదర్శకాలు కారణంగా చూపుతూ 2021 డిసెంబర్ 17న కల్పించిన సేవను తితిదే రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ భక్తుడు ఆర్.ప్రభాకర్రావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. మరోవైపు వివిధ ఆర్జిత సేవల కోసం బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేశారని పేర్కొంటూ మరికొందరు వ్యాజ్యాలు దాఖలు చేశారు. కొవిడ్ కారణాలు చూపుతూ మేల్చాట్ వస్త్ర సేవను రద్దు చేస్తున్నట్లు తితిదే అధికారులు తెలిపారన్నారు. బ్రేక్ దర్శనం లేదా టికెట్కు చెల్లించిన సొమ్మును వెనక్కి తీసుకోవాలని కోరారన్నారు. తమ మనోభావాలను గౌరవించకుండా ఏకపక్షంగా సేవల టికెట్లను రద్దు చేశారన్నారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎం. విద్యాసాగర్, న్యాయవాది సీహెచ్ ధనంజయ్, తదితరులు వాదనలు వినిపిస్తూ.. '14 ఏళ్ల కిందట టికెట్ బుక్ చేసుకున్నారు. ఆర్జితసేవలు చేసేందుకు పిటిషనర్లు చట్టబద్ధంగా అర్హులు. తక్షణమే సేవల భాగ్యం కల్పించాలని కోరడం లేదు. ఆర్జితసేవలు పునఃప్రారంభం అయిన ఒకటి రెండేళ్లలోపు అవకాశం కల్పించాలని కోరుతున్నారు . 17,490 మంది టికెట్ పొందిన వారిలో 8,347 మంది భక్తులు మాత్రమే బ్రేక్ దర్శనం పొందారు. 191 మంది మాత్రమే టికెట్ సొమ్ము వెనక్కి ఇవ్వాలని కోరారు. పిటిషనర్లతో పాటు మిగిలిన 8,918 మంది భక్తులు ఎలాంటి ఐచ్ఛికాన్ని కోరుకోలేదు. సేవల భాగ్యం కల్పించకపోవడం 14 ఏళ్లుగా పెట్టుకున్న ఆశను నిరాకరించడమే ' అన్నారు.

తితిదే అధికారులు కౌంటర్ దాఖలు చేస్తూ.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల నేపథ్యంలో స్వామివారి దర్శనాన్ని నిలిపేశామన్నారు. అప్పటికే టికెట్ బుక్ చేసుకున్న వారికి బ్రేక్ దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపామన్నారు. కొవిడ్ తగ్గిపోయి సాధారణ పరిస్థితులు ఏర్పడినప్పటికీ.. అప్పటికే వివిధ తేదీల్లో సేవల కోసం టికెట్ బుక్ చేసుకున్న భక్తులు ఉంటారన్నారు. ఈ నేపథ్యంలో పూర్వం బుక్ చేసుకున్న వారిని సర్దుబాటు చేయలేమన్నారు. టికెట్లను రద్దు చేస్తూ తితిదే తీసుకున్న నిర్ణయం సహేతుకమైనదేనన్నారు. తితితే బోర్డు చేసిన తీర్మానం సరైనదేనన్నారు. ప్రజాహితం , భక్తుల ప్రయోజనం నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దేవస్థానం చరిత్రలో ఆర్జిత సేవలు ఇన్ని ఎక్కువ రోజులు రద్దు చేయడం ఇదే మొదటిసారి అన్నారు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని వ్యాజ్యాలను కొట్టేయాలని కోరారు.

ఇరువైపు న్యాయవాదుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. స్థలాభావం కారణంగా పూర్వం టికెట్ బుక్ చేసుకున్న వారిని తాజాగా సర్దుబాటు చేయలేమన్న తితిదే వాదనలను తప్పుపట్టారు. ఈ ఏడాది జూన్, జులై నెలల్లో ఆర్జిత సేవల టికెట్ బుక్ చేసుకోవాలని తితిదే మే నెలలో నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రతి నెల టికెట్లు బుక్ చేసుకునేందుకు తితిదే వెసులుబాటు కల్పిస్తుందన్నారు. ఒకటిరెండేళ్లలో ఆర్జిత సేవకు అవకాశం కల్పించాలని పిటిషనర్లు చేస్తున్న అభ్యర్థనను ఎందుకు నిరాకరిస్తున్నారన్నారు. స్వామివారిపై విశ్వాసంతో ఆర్జిత సేవ కోసం పిటిషనర్లు టికెట్లు బుక్ చేసుకున్నారన్నారు. తితిదే ఆర్జితసేవకు అవకాశం కల్పిస్తుందనే చట్టబద్ధమైన నిరీక్షణ ఫలితం (లెజిటిమేట్ ఎక్స్పెటేషన్స్) కోసం పిటిషనర్లు వేచి చూస్తున్నారన్నారు. ఒకవైపు కొత్తగా బుక్ చేసుకున్న భక్తులకు అవకాశం కల్పిస్తూ.. మరోవైపు గతంలో బుక్ చేసుకున్న వారికి ఆర్జిత సేవలు నిరాకరించడం అధికరణ 14ని ఉల్లంఘించడమేన్నారు. ఆర్జిత సేవలకు అవకాశం కల్పిస్తూ దేవస్థానం చేసిన ఆహ్వానం మేరకు పిటిషనర్లు టికెట్ బుక్ చేసుకున్నారన్నారు. ఆ హామీకి దేవస్థానం కట్టుబడి ఉండాలన్నారు. హామీ నుంచి వైదొలగడానికి వీల్లేదన్నారు.

రాజధాని అమరావతి వ్యవహారంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం కీలక తీర్పు ఇస్తూ.. చట్టబద్ధమైన నిరీక్ష ఫలితం, ఇచ్చిన హామీ నుంచి వైదొలగడానికి వీల్లేదని స్పష్టం చేసిందని గుర్తు చేశారు. 14 ఏళ్ల కిందట బుక్ చేసుకున్న ఆర్జితసేవలను రద్దు చేయడం ఏకపక్షమన్నారు. సేవలను రద్దు చేస్తున్నట్లు తితిదే పిటిషనర్లకు పంపిన లేఖలను రద్దు చేస్తున్నామన్నారు. పిటిషనర్ల వినతులను పరిగణనలోకి తీసుకొని స్వామివారికి ఆర్జితసేవ కల్పించాలని తితిదే అధికారులను ఆదేశించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details