గంగవరం నౌకాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వ 10.40 శాతం వాటా విక్రయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అదానీ పోర్ట్స్, ప్రత్యేక ఆర్థిక మండలి (ఏపీ ఎస్ఈజెడ్) డైరెక్టర్, సీఈవో కరణ్ అదానీకి హైకోర్టు నోటీసులు జారీచేసింది. కృష్ణపట్నం పోర్టు విషయంలోనూ ఆ సంస్థ డైరెక్టర్కు నోటీసులు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఇదే వ్యవహారంతో ముడిపడి ఉన్న మరో వ్యాజ్యంతో కలిపి విచారిస్తామని పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్రా, జస్టిస్ లలితతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది.
పారదర్శక విధానం పాటించకుండా, గ్లోబల్ టెండర్ ప్రక్రియను అనుసరించకుండా గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటా విక్రయాన్ని, అందుకు సంబంధించిన జీవోలను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన నారాయణ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ వేశారు.