ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రానికి హైకోర్టు నోటీసులు - privatization of Visakhapatnam steel news

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై కౌంటర్ దాఖలు చేయమంటూ... కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయానికి ముందు... పరిశ్రమకు భూములిచ్చిన వారి హక్కుల రక్షణ, పిటిషనర్, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయాలు పరిగణనలోకి తీసుకున్నారా లేదా అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని నిర్దేశించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

కేంద్రానికి హైకోర్టు నోటీసులు
కేంద్రానికి హైకోర్టు నోటీసులు

By

Published : Apr 16, 2021, 5:11 AM IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రానికి హైకోర్టు నోటీసులు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ... 'జాయిన్ ఫర్ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్ ఛైర్మన్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దాఖలుచేసిన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు.... ఏపీ ప్రజల పోరాట ఫలితంగా విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటైందని గుర్తుచేశారు. ప్లాంట్ కోసం ప్రజలు తమ భూముల్ని, జీవితాల్ని త్యాగం చేశారన్నారు.

ఉక్కు పరిశ్రమకు 22 వేల ఎకరాలు సేకరించిన కేంద్ర ప్రభుత్వం... ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పునరావాసం, ఉద్యోగ భద్రత కల్పించలేదని న్యాయవాది బి.ఆదినారాయణరావు వివరించారు. భూములు త్యాగం చేసిన వారికి జీవనోపాధి కల్పించకపోవడం ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించడమేనన్నారు. భూసేకరణ సమయంలో ఉద్యోగాల హామీ ఇచ్చి, ఆ తర్వాత వెనక్కి తగ్గడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కర్మాగారంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ లక్షల మందికి జీవనాధారం చూపకుండా ప్రైవేటీకరణ చేస్తే... వారి జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.

విశాఖ ఉక్కును లాభాల బాట పట్టించడానికి ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల్ని పరిశీలించకుండా... ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోవడం ఏకపక్షమని న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదించారు. నష్టాల సాకుతో వంద శాతం పెట్టుబడులు ఉపసంహరణకు అనుమతిచ్చే చట్ట నిబంధనే లేదన్నారు. నష్టాల పేరుతో గతంలో హిందుస్థాన్ జింక్‌ను ప్రైవేటీకరిస్తే... ఆ సంస్థ యాజమాన్యం పరిశ్రమను మూసేసి స్థిరాస్తి వ్యాపారం చేసిందని గుర్తుచేశారు. పరిశ్రమల కోసం ప్రజలు భూములిచ్చారే తప్ప, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాదన్నారు. ప్రభుత్వాలు ఇష్టానుసారం ఆర్థికపరమైన విధాన నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదన్నారు. ఇలాంటి అంశాలపై న్యాయస్థానాలు పునఃసమీక్ష చేయాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ బలోపేతంపై పిటిషనర్, రాష్ట్ర ప్రభుత్వం.... పలు ప్రత్యామ్నాయ మార్గాల్ని చూపుతూ కేంద్రానికి లేఖలు రాసినట్లు చెప్పారు. వాటిని పరిగణనలోకి తీసుకున్నారా, లేదా అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు వివరించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రైవేటుపరం చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయన్నారు.


పిటిషనర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాదనలు విన్న ధర్మాసనం... పెట్టుబడుల ఉపసంహరణపై న్యాయసమీక్ష పరిమితమైనదని పేర్కొంది. ప్రభుత్వ ఆర్థిక సంబంధ నిర్ణయాలు సరైనవా, కావా అనే విషయాన్ని తేల్చడం... ఈ కోర్టు పరిధిలోనిది కాదని తెలిపింది. మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు ప్రభావితమైన సందర్భాల్లో... ఆర్థిక విధాన నిర్ణయాలు న్యాయసమీక్ష పరిధిలోకి వస్తాయని వివరించింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో... భూములిచ్చిన వారి హక్కులు, ఉద్యోగుల జీవనోపాధి తదితర అంశాలు ముడిపడి ఉన్నాయని పిటిషనర్ చెబుతున్నారని అభిప్రాయపడింది. ప్రైవేటీకరణ ప్రభావం చాలామందిపై పడుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారని... ఈ నేపథ్యంలో భూములిచ్చిన వారి ఆందోళనలు, ప్రత్యామ్నాయాలను పరిగణనలోకి తీసుకున్నారా, లేదా అనే విషయంపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇదీ చదవండీ... తిరుపతి ఉపఎన్నికకు వాలంటీర్లను దూరంగా ఉంచాలి: సీఈసీ

ABOUT THE AUTHOR

...view details