అక్టోబరు 9న 2018లో... అప్పటి ఉమ్మడి హైకోర్టు కొలీజియం ఏపీ హైకోర్టుకు నలుగురు, తెలంగాణకు ముగ్గుర్ని న్యాయమూర్తులుగా నియమించేందుకు 7 పేర్లను న్యాయవాదుల కోటా నుంచి సిఫారసు చేసింది. ఆ పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదిస్తూ చేసిన తీర్మానాన్ని 2019 జులై 25న కేంద్రానికి సిఫారసు చేసింది. తాజాగా కేంద్రం అంగీకరించడంతో రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో నలుగురి నియామకానికి ఉత్తర్వులు వెలువడ్డాయి.
రావు రఘునందన్‌రావు
రావు చిన్నారావు, విలాశితకుమారి దంపతులకు రఘునందన్‌రావు 1964 జూన్ 30న జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్య అనంతరం నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి కామర్స్‌లో డిగ్రీ, 1988లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. న్యాయవాదిగా 30 ఏళ్ల అనుభవం ఉంది. 1993-94లో వాణిజ్యపన్నుల కేసుల్లో సహాయ ప్రభుత్వ న్యాయవాది (ఏజీపీ)గా, 1995లో ఏజీ కార్యాలయంలో ప్రత్యేక ఏజీపీగా పనిచేశారు. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఐఓసీ, గెయిల్, పలు కార్పొరేషన్లకు స్టాండింగ్ కౌన్సెల్‌గా సేవలు అందించారు. కేంద్రప్రభుత్వం తరఫున తెలంగాణ, ఏపీ హైకోర్టుల్లో సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్ ప్యానల్లో సభ్యులుగా నియమితులయ్యారు.
బట్టు దేవానంద్
కృష్ణాజిల్లా గుడివాడలో ప్రభుత్వోపాధ్యాయులు బట్టు వెంకటరత్నం, మనోరంజితం దంపతులకు 1966 ఏప్రిల్ 14న దేవానంద్ జన్మించారు. గుడివాడ మున్సిపల్ స్కూల్లో పాఠశాల విద్య, ఏఎన్‌ఆర్ కళాశాలలో ఇంటర్, బీఏ పూర్తిచేశారు. ఏయూ లా కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టాపొందారు. 1996 నుంచి 2000 వరకు హైకోర్టులో సహాయ ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. బీఎస్‌ఎన్‌ఎల్, న్యూఇండియా ఎష్యూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ఎస్బీఐ, ఎన్టీపీసీ తదితర సంస్థలకు న్యాయవాదిగా సేవలందించారు. 2014 జులై నుంచి 2019 మే వరకు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2006లో ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయ్యారు.
దొనాడి రమేశ్
చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని కమ్మపల్లికి చెందిన డీవీ నారాయణనాయుడు, అన్నపూర్ణ దంపతులకు 1965 జూన్ 27న దొనాడి రమేశ్ జన్మించారు. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల నుంచి బీకాం, వీఆర్ న్యాయకళాశాల నుంచి 1990లో న్యాయశాస్త్రం పూర్తిచేశారు. ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా వృత్తిజీవితాన్ని ప్రారంభించారు. జస్టిస్ పీఎస్ నారాయణ న్యాయవాదిగా పనిచేసినప్పుడు ఆయన కార్యాలయంలో న్యాయవాదిగా వృత్తి మెలకువలను తెలుసుకున్నారు. 2000 నుంచి 2004 వరకు సర్వీసు సంబంధ వివాదాలు చూసే ప్రభుత్వ న్యాయవాది(జీపీ)గా పనిచేశారు. 2007 నుంచి 2013 వరకు ఏపీ ఎస్‌ఎస్‌ఏకు స్టాండింగ్ కౌన్సెల్‌గా సేవలందించారు. 2014 నుంచి 2019 మే వరకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ)గా పనిచేశారు.
నైనాల జయసూర్య
ఇందిరాదేవి, ఎన్‌వీవీ కృష్ణారావు దంపతులకు 1968లో నైనాల జయసూర్య జన్మించారు. జయసూర్య పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పాఠశాల విద్య, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బీకాం, విజయవాడ సిద్దార్థ లా కళాశాలలో న్యాయశాస్త్రం చదివారు. 2003-04లో ఏజీ కార్యాలయంలో ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2009 నుంచి 2014 వరకు ఏపీ వ్యవసాయశాఖ ప్రభుత్వ న్యాయవాదిగా సేవలు అందించారు. తెలంగాణ రాష్ట్ర సహకార ఎన్నికల అథార్టీకి 2018-19లో స్టాండింగ్ కౌన్సెల్‌గా పనిచేశారు. బీహెచ్‌ఈఎల్, ఆప్కో, ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్ట్ (ప్రస్తుతం వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్)కు సంబంధించిన కేసుల్లో ప్యానల్ న్యాయవాదిగా వాదనలు వినిపించారు.