Amaravati Win: రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రానికి ఓ మహానగరం నిర్మిద్దామన్న గత ప్రభుత్వ పిలుపుతో అమరావతి రైతులు ముందుకొచ్చారు. ల్యాండ్‌పూలింగ్ విధానంతో ఏళ్లుగా జీవనాధారమైన భూములను ప్రభుత్వం మీద నమ్మకంతో ఇచ్చారు. సాక్షాత్తూ ప్రధాని మోదీ వచ్చి నూతన రాజధానికి శంకుస్థాపన చేయడంతో అభివృద్ధికి ఢోకా లేదనుకున్నారు. నిర్మాణాలూ ప్రారంభమై.. కొన్ని పూర్తయ్యాయి. ప్రభుత్వ కార్యాకలాపాలు అమరావతి నుంచే జరగడం మొదలైంది.
ఇంతలో ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వం మారింది. రాజధాని మీద నిర్ణయమూ మారింది. 3 రాజధానులంటూ కొత్త ప్రతిపాదనలు తెరపైకి తెచ్చారు. భవిష్యత్ ఆశలు కళ్లముందే కూలిపోవడంతో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రానికి గొడ్డలిపెట్టులా మారుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. నిర్ణయం మార్చుకుని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని మొరపెట్టుకున్నారు. అయినా పాలకుల్లో మార్పు రాలేదు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేది లేదంటూ..అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్నారు. మండలిలో ఘర్షణ వాతావరణం తర్వాత....బిల్లుకు గవర్నర్ ఆమోదంతో చట్టం రూపొందింది.
కడుపు మండిన అన్నదాతలు రోడ్డెక్కారు. ప్రభుత్వ నిర్ణయం అనాలోచితమంటూ ఆందోళనకు దిగారు. వివిధ రూపాల్లో నిరసనలు పెల్లుబికాయి. రెండు చట్టాల్ని హైకోర్టులో సవాల్ చేయడంతో..వాటిపై న్యాయస్థానం స్టేటస్ కో విధించింది. ఓ వైపు న్యాయపోరాటం చేస్తూనే మరోవైపు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. శిబిరాల్లో ఆందోళనలు, దేవతలకు విన్నపాలు, న్యాయస్థానం-దేవస్థానం పేరిట పాదయాత్రలతో నిరసనలు హోరెత్తించారు.
ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లు, విమర్శలు ఎదుర్కొన్నారు. అవమానాలను భరించారు. ఆకాంక్ష కోసం అన్నింటిని దిగమింగారు. స్థానిక ప్రజల మద్దతు, అపూర్వ స్వాగతాలతో అలుపెరగని పోరాటంలో మరింత దూకుడుగా ముందుకెళ్లారు. ఎక్కడా వివాదాల జోలికి పోకుండా అమరావతి ఎందుకు అవరసమో వివరిస్తూ...ముందుకు కదిలారు. మధ్యలో పోలీసుల అడ్డగింతను ఓర్పుగా, నేర్పుగా ఎదుర్కొంటూనే....45 రోజుల్లో యాత్రను పరిపూర్ణం చేశారు. తర్వాత కూడా వివిధ జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి....అమరావతి ఆవశ్యకతను వివరించారు.