TS minister murder conspiracy case :తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర కేసుకు సంబంధించి ప్రైవేటు ఫిర్యాదుపై నమోదైన కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. హైదరాబాద్ సీపీతో సహా 17 మంది పోలీసులపై కింది కోర్టులో విచారణను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్‌కు చెందిన బి.విశ్వనాథ్, సి.రాఘవేంద్రరాజులను అక్రమంగా కిడ్నాప్ చేసి నిర్బంధిచారంటూ విశ్వనాథ్ భార్య పుష్పలత మంత్రి శ్రీనివాస్‌గౌడ్, హైదరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రతో పాటు 17 మంది పోలీసులపై దిగువ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు.
TS minister murder conspiracy case update : దీనిపై విచారించిన మహబూబ్‌నగర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు పోలీసులకు సమన్లు జారీ చేసింది. ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా జిల్లా కోర్టులో నమోదైన కేసును కొట్టివేయాలంటూ స్టీఫెన్ రవీంద్రతో పాటు పోలీసులు వేర్వేరుగా పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై విచారించిన హైకోర్టు కింది కోర్టులో విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబరు 2కి వాయిదా వేసింది.
మంత్రిపై కుట్ర ఎలా బయటపడింది..మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను చంపేందుకు ఫరూక్‌తో రాఘవేంద్రరావు ఒప్పందం కుదుర్చుకున్నారు. మంత్రి హత్యకు రూ.15 కోట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఫరూక్‌ను మధుసూదన్, అమరేందర్ సంప్రదించారు. తామే డబ్బులిస్తామని ఒప్పుకున్నారు. ఆ తర్వాత.. ఈ హత్య కుట్ర గురించి ఫరూక్.. తన స్నేహితుడైన హైదర్‌కు చెప్పాడు. ఇదే విషయంపై వివాదం మొదలైంది. ఆ వివాదం కాస్తా.. కుట్ర మొత్తం బయటపడేలా చేసింది. హత్య కుట్ర గురించి ఫరూక్.. హైదర్‌కు చెప్పాడన్న కోపంతో.. ఈ విషయం తెలిసిన వాళ్లిద్దరిని చంపాలని మిగతా వాళ్లు ప్లాన్ చేశారు. కానీ.. వాళ్లు తప్పించుకుని పోలీసులను ఆశ్రయించటంతో.. దాడి చేసిన వాళ్లు దొరికిపోయారు.
అరెస్టులు.. ఫిబ్రవరి 23న ఫరూక్, హైదర్ అనే ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్‌లోని సుచిత్ర వద్ద ఓ లాడ్జీలో దిగారు. ఫిబ్రవరి 25న ఫరూక్, హైదర్‌పై ఒక ముఠా దాడి చేశారు. ఆ దాడి నుంచి తప్పించుకుని.. తమపై హత్యాయత్నం జరిగిందని పేట్‌బషీరాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. వాళ్లిద్దరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దాడికి యత్నించింది.. యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్ అని తేలింది. ఫిబ్రవరి 26న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి విచారించారు.
ఇవీ చదవండి: