ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొడాలి నాని మీడియాతో మాట్లాడొచ్చు: హైకోర్టు

high-court
high-court

By

Published : Feb 18, 2021, 11:39 AM IST

Updated : Feb 19, 2021, 6:19 AM IST

11:36 February 18

కొడాలి నాని పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

కొడాలి నాని పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ), ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై ఎలాంటి వ్యక్తిగత దూషణలకు పాల్పడవద్దని మంత్రి కొడాలి నానికి హైకోర్టు స్పష్టం చేసింది. మీడియాతో, సమావేశాల్లో మాట్లాడేందుకు అనుమతిచ్చింది. వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా ఉన్న కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు నోటీసు అందజేయడానికి పిటిషనర్‌కు అనుమతించింది. కమిషనర్‌ వాదనలను వినాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఎస్‌ఈసీ, రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మార్చి 18కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు గురువారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ నెల 12న నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎస్‌ఈసీ, కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా, ఎస్‌ఈసీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని పౌరసరఫరాలశాఖ మంత్రి నానికి కమిషనర్‌ షోకాజ్‌ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దానిపై మంత్రి ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఈనెల 21 వరకు మీడియాతో మాట్లాడొద్దని స్పష్టం చేశారు. ఆ ఉత్తర్వులపై మంత్రి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం జరిగిన విచారణలో అమికస్‌ క్యూరీ, సీనియర్‌ న్యాయవాది పి.శ్రీరఘురాం, మిగిలిన న్యాయవాదుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి మధ్యేమార్గంగా గురువారం ఉత్తర్వులిస్తానని వెల్లడించిన విషయం తెలిసిందే. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎస్‌ఈసీపై చేసిన వ్యాఖ్యల విషయంలో ఇటీవల హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల క్రమంలోనే మంత్రి నాని విషయంలోనూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు.


రాజ్యాంగ సంబంధ విస్తృతాంశాలు ఉన్నాయి
‘న్యాయవాదుల వాదనలు విన్నాక రాజ్యాంగ సంబంధ విస్తృతాంశాలు ఈ వ్యాజ్యంతో ముడిపడి ఉన్నాయని కోర్టు అభిప్రాయపడుతోంది. రాజ్యాంగ అధికరణ 19 ప్రకారం పిటిషనర్‌కు ప్రసాదించిన ప్రాథమిక హక్కులు.. ఎన్నికల సంఘానికి రాజ్యాంగం కల్పించిన అధికారాలను సమతుల్యం చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ విధులు నిర్వర్తిస్తున్న మంత్రి చేసిన ఆరోపిత వ్యాఖ్యలు ఎన్నికల స్వేచ్ఛ, నిష్పాక్షికతపై ప్రభావం చూపుతున్నాయా? ఎన్నికల కమిషన్‌ వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అనివార్యత ఉందా తేల్చాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తీసుకున్న చర్యలు సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా పరిశీలించాల్సి ఉంది. కోర్టు ముందున్న వ్యవహారం చాలా ప్రాముఖ్యమైనది, న్యాయ సంబంధ అంశాలతో ముడిపడి ఉంది. ఈ దశలో మొత్తం వ్యవహారాన్ని తేల్చలేమని అభిప్రాయపడుతున్నాం. హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల క్రమంలో ఉత్తర్వులిస్తున్నాం. ఎస్‌ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను సవరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నాం...’ అని న్యాయమూర్తి వివరించారు.


‘ఉపాధి’ బకాయి వివరాలు సమర్పించండి
ఉపాధి హామీ పథకం కింద రూ.5లక్షలలోపు విలువ చేసే పనులకు 20శాతం సొమ్మును మినహాయించి చెల్లిస్తామని పేర్కొన్న ప్రభుత్వం.. ఇప్పటి వరకు ఆయా సొమ్ము జమ చేయలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ తదుపరి విచారణలో పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాది(జీపీ)ని ఆదేశించింది. విచారణను మార్చి 1కి వాయిదా వేసింది. ఉపాధి హామీ పథకం కింద 2018-19 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. గత నెలలో జరిగిన విచారణలో జీపీ వాదనలు వినిపిస్తూ.. రూ.5లక్షల లోపు పనులకు 20శాతం సొమ్మును మినహాయించి చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గురువారం మరోసారి విచారణకు రాగా ఆ వివరాల్ని కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని కోరారు. 

ఇదీ చదవండి:

'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు'.. నిరంతర స్ఫూర్తి రగిల్చే నినాదం

Last Updated : Feb 19, 2021, 6:19 AM IST

ABOUT THE AUTHOR

...view details