ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కోర్టు రాజకీయ వేదిక కాదు... ఏఏజీ వ్యాఖ్యలపై హైకోర్టు

ప్రభుత్వ భూముల వేలానికి సంబంధించి మిషన్ బిల్డ్ ఏపీపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. పూర్తిస్థాయి విచారణను అక్టోబర్ 16వ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం చేసే ప్రతి పనికి పిటిషనర్లు అడ్డుపడుతున్నారని అదనపు అడ్వకేట్ జనరల్ విచారణలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై హైకోర్టు స్పందిస్తూ...కోర్టు రాజకీయ వేదిక కాదని స్పష్టం చేసింది. అక్టోబర్ 6వ తేదీలోపు కౌంటర్​ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

high court
high court

By

Published : Sep 18, 2020, 3:42 PM IST

Updated : Sep 18, 2020, 10:52 PM IST

హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు

మిషన్ బిల్డ్ ఏపీపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు...పూర్తిస్థాయి విచారణను అక్టోబర్ 16వ తేదీకి వాయిదా వేసింది. గుంటూరు, విశాఖ జిల్లాల్లో ప్రభుత్వ భూములు, ఆస్తుల విక్రయాన్ని సవాలు చేస్తూ గుంటూరుకు చెందిన తోట సురేశ్ బాబు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంతో పాటు పలు పిటిషన్లపైనా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ వ్యాజ్యాలతో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ కార్యదర్శులు...అక్టోబర్ 6వ తేదీలోగా కౌంటర్లు దాఖలు చేయాలని, పిటిషనర్లు అక్టోబర్ 9వ తేదీలోగా రిప్లే కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మిషన్ బిల్డ్ ఏపీ ద్వారా భూముల వేలాన్ని నిలిపివేయాలని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

ప్రభుత్వ భూములు విక్రయించేందుకు సర్కారు చేస్తున్న యత్నాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా శుక్రవారం హైకోర్టులో ఆసక్తికర చర్చ జరిగింది. దాఖలైన తొమ్మిది వ్యాజ్యాలు ఒకే అంశానికి సంబంధించినవేనా? అని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఔనని బదులిస్తూ... ఎవరు ప్రభుత్వాన్ని నడపాలి అనేదే ఇక్కడ సమస్య అన్నారు. వారు నడపాలా ? మేము నడపాలా ? అనేదే సమస్య' అని వ్యాఖ్యానించారు. ఏఏజీ వ్యాఖ్యలపై ధర్మాసనం స్పందిస్తూ..'ప్రభుత్వమా లేక హైకోర్టా' మీరు తెలియజేయాలనుకుంటున్నది? అని ప్రశ్నించింది. దానికి ఏఏజీ బదులిస్తూ.. హైకోర్టు గురించి కాదన్నారు. పిటిషనర్లు ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నారు అన్నారు.

రాజకీయాంశంపై విచారణ కాదు

గతంలో పలు పరిశ్రమలను విక్రయిస్తే ఎవరూ నోరు మొదపలేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అన్నారు. ఈ వ్యాజ్యాల్లో ప్రజాహితం లేదని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ పురోగతిని నిలువరించాలన్న ఉద్దేశంతో వ్యాజ్యాలు దాఖలు చేశారన్నారు. ఆ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. అసలు విషయం నుంచి దారి తప్పొద్దు అని సూచించింది. అనవసరంగా ఆ విషయాల్ని మాకెందుకు చెబుతున్నారు... ఆ అంశాలు తమ ముందు విచారణలో లేవని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎమ్మార్వో కార్యాలయం, శిశుసంక్షేమశాఖకు చెందిన ఆస్తుల్ని ప్రభుత్వం విక్రయిస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదించారు. ఆ వాదనపై ఏఏజీ స్పందిస్తూ మీరే ప్రభుత్వాన్ని నడపండి అన్నారు. ధర్మాసనం కొంత అసహనం వ్యక్తం చేస్తూ... రాజకీయాంశాన్ని నిర్ణయించేందుకు హైకోర్టు విచారణ జరపడం లేదు, స్వీయ నిగ్రహం పాటించాలని ఏఏజీకి సూచించింది. అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి :తెలంగాణ: నేరెడ్‌మెట్‌ బండ చెరువులో బాలిక మృతదేహం లభ్యం

Last Updated : Sep 18, 2020, 10:52 PM IST

ABOUT THE AUTHOR

...view details