రాజధానితో ముడిపడి ఉన్న వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి, జస్టిస్ ఎన్. జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తుది విచారణ జరుపుతోంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ ' అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య ఉపాధ్యక్షుడు పానకాలరెడ్డి కల్లం, న్యాయవాది నరహరిశెట్టి నరసింహారావు, మరికొందరు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా లేవని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఆ చట్టాలను చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఏపీ విభజన కోసం పార్లమెంట్ చేసిన చట్టం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ సిఫారుసులను పరిగణనలోకి తీసుకున్నాకే అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిని నిర్ణయించిందని తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘన
పదేళ్ల పాటు హైదరాబాద్ తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలో పేర్కొన్నారన్నారు. రెండు రాష్ట్రాలతో ముడిపెడుతూ విభజన చట్టం తీసుకొచ్చారని, ఆ చట్టం తదనంతర పరిణామాల్లో రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాన్ని వినియోగించి అమరావతిని రాజధానిగా నిర్ణయించిందన్నారు. ఒకసారి నిర్ణయం జరిగాక రాజధాని గురించి మరోసారి ఆలోచన చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదని వాదనలు వినిపించారు. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దుకు సంబంధించిన బిల్లులను శాసనమండలి ఛైర్మన్ సలహా కమిటీకి సిఫారుసు చేశాక ఆ బిల్లులను శాసనసభలో మరోసారి ప్రవేశపెట్టి ఆమోదించడం చట్ట విరుద్ధమన్నారు. ద్విసభల విధానం అమల్లో ఉన్న రాష్ట్రంలో శాసనమండలి అభిప్రాయాన్ని విస్మరించడానికి వీల్లేదని.. సెలక్టు కమిటీని ఏర్పాటు చేయకపోవడం అధికారయంత్రాంగం చేసిన పెద్ద తప్పని మండలి ఛైర్మన్ సిఫారుసులను అధికారులు తక్కువ చేసి చూడటానికి వీల్లేదన్నారు. శాసనమండలి నుంచి బిల్లులను తిరస్కరించడమో లేదా సవరణ చేయమని కోరడమో లేదా అంగీకరించడమో ఏదో ఒక నిర్ణయం వెలువడకముందే శాసనసభలో మరోమారు ప్రవేశపెట్టడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని తెలిపారు. శాసనమండలి నిర్ణయం రిజర్వులో ఉండగా ఆ బిల్లులను గవర్నర్ ఆమోదించడం చెల్లుబాటు కాదని వాదించారు.
రైతుల హక్కులు హరించడమే