CM Jagan: జగన్ మీద కేసుల ఉపసంహరణపై నేడు హైకోర్టు సుమోటో విచారణ - ఏపీ హైకోర్టు వార్తలు
20:39 June 22
బుధవారం విచారణ జరిగే అవకాశం
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనపై నమోదైన వివిధ క్రిమినల్ కేసులను పోలీసులు, ఫిర్యాదుదారులు నిబంధనలకు విరుద్ధంగా ఉపసంహరించడాన్ని హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. మొత్తం 11 క్రిమినల్ రివిజన్ పిటిషన్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత ముందుకు బుధవారం విచారణకు రానున్నాయి. జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదైన పలు కేసులను కొవిడ్ సమయంలో పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (పీపీ), సంబంధిత న్యాయాధికారులు నిబంధనలకు విరుద్ధంగా హడావుడిగా ఉపసంహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ కేసుల వివరాలు హైకోర్టు దృష్టికి వచ్చాయి. హైకోర్టు పరిపాలన విభాగం.. ఈ కేసులను పరిశీలించి సుమోటోగా విచారణకు తీసుకుని, హైకోర్టు రిజిస్ట్రీకి నంబర్లు కేటాయించింది. సుమోటోగా తీసుకున్న కేసులో రాష్ట్ర ప్రభుత్వం, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిర్యాదుదారులు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతివాదులుగా ఉన్నారు. ఉపసంహరించిన మొత్తం 11 కేసుల్లో.. అనంతపురం జిల్లాకు సంబంధించినవి అయిదు, గుంటూరు జిల్లాకు సంబంధించినవి ఆరు కేసులు ఉన్నాయి.
ఇదీ చదవండి:
ఏపీ ప్రాజెక్టులపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు