రామప్ప కట్టడానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా దక్కడం తెలంగాణకు గర్వకారణమని ఆ రాష్ట్ర హైకోర్టు పేర్కొంది. డిసెంబరు నెలాఖరులోగా యునెస్కో చెప్పిన విధంగా అభివృద్ధి, నిర్వహణ ప్రాజెక్టు పూర్తి స్థాయి.. శాశ్వత దక్కించుకోవాలని స్పష్టం చేసింది. డిసెంబరు నెలాఖరు వరకు సమగ్ర పరిరక్షణ, అభివృద్ధి ప్రాజెక్టు పూర్తి చేయాలని యునెస్కో అనుబంధ సంస్థ... అంతర్జాతీయ కట్టడాలు, ప్రాంతాల మండలి.. ఐకొమాస్ స్పష్టం చేసింది.
పత్రికల కథనాల ఆధారంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం స్వచ్ఛందంగా విచారణ చేపట్టింది. రామప్ప కట్టడానికి యునెస్కో గుర్తింపు పట్ల హర్షం వ్యక్తం చేసిన హైకోర్టు.. ప్రపంచ పటంలో స్థానం పొందడం రాష్ట్రానికి గర్వకారణమని వ్యాఖ్యానించింది. అయితే ప్రపంచ అంచనాలకు అనుగుణంగా రామప్ప పరిసరాలను తీర్చిదిద్దాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
యుద్ధ ప్రాతిపదికన నడుం బిగించాలి..
చారిత్రకంగా అత్యంత విలువైన రామప్ప సంపద...అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారుతుందని ధర్మాసనం ఆశాభావం వ్యక్తం చేసింది. శాశ్వత హోదా కోసం డిసెంబరు నెలాఖరు వరకు సమగ్ర పరిరక్షణ, అభివృద్ధి ప్రాజెక్టు పూర్తి చేయాలని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖలు, హెరిటేజ్ కమిటీ ఉన్నతాధికారులు, కలెక్టర్‌తో కూడిన కమిటీ నడుం బిగించాలని దిశానిర్దేశం చేసింది. హైదరాబాద్‌లో ఆగస్టు 4న తొలి సమావేశం నిర్వహించాలని.. ఆ తర్వాత సందర్భానుసారంగా భేటీ కావాలని ఆదేశించింది. రామప్ప కట్టడాల క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని తెలిపింది. ఇప్పటికే సమయం ప్రారంభమైందని.. డిసెంబరు నెలాఖరుతో ముగియనున్నందున.. యుద్ధ ప్రాతిదికన నడుం బిగించాలని సూచించింది.