ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HEARING IN HIGH COURT : ఆ బకాయిలను.. వచ్చే ఏడాది జూన్​ నాటికి చెల్లిస్తాం: ప్రభుత్వం - power production company

పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు జులై నుంచి డిసెంబర్ వరకు చెల్లించాల్సిన బకాయిలను.. వచ్చే ఏడాది జూన్ లో చెల్లిస్తామని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థలు నివేదించాయి. ఈ మేరకు హైకోర్టులో దాఖలైన పిటిషన్​పై విచారణ జరిగింది.

ఆంధ్రప్రదేశ్ హై కోర్టు
ఆంధ్రప్రదేశ్ హై కోర్టు

By

Published : Dec 29, 2021, 10:51 PM IST

పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు జులై నుంచి డిసెంబర్ నెల వరకు చెల్లించాల్సిన బకాయిలను.. వచ్చే ఏడాది జూన్​లో చెల్లిస్తామని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి.. రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థలు నివేదించాయి. మూడో త్రైమాసిక బకాయిలను 2022 మార్చికి, నాలుగో త్రైమాసిక బకాయిలను 2022 జూన్ నాటికి చెల్లిస్తామని పేర్కొంటూ అనుబంధ సిటిషన్ దాఖలు చేశాయి.

ఈ పిటిషన్​పై కౌంటర్ వేయాలని సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థల తరఫు న్యాయవాదులను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 17కు వాయిదా వేసింది. 17, 18 తేదీల్లో ఈ వ్యాజ్యాలపై తుది విచారణ చేస్తామని తెలిపింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఎన్. జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

అఫిడవిట్ దాఖలుకు గతంలో ఆదేశం..
గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై.. యూనిట్ టారిఫ్ ధరలను ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి సమీక్షించేందుకు వీలు కల్పిస్తూ 2019లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం.. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన ఈ ఏడాది జూన్ బకాయిలను డిసెంబర్ 29 లోపు చెల్లించాల్సిందేనని డిస్కంలకు తేల్చిచెప్పింది. జులై నుంచి డిసెంబర్ బకాయిలను ఎప్పటిలోగా చెల్లిస్తారో తెలియజేస్తూ అఫిడవిట్ వేయాలని గతంలోనే ఆదేశించింది.

విచారణ వాయిదా..
తాజాగా జరిగిన విచారణలో ప్రభుత్వం, డిస్కంల తరఫున ఏజీ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాల మేరకు జూన్ బకాయిల చెల్లింపునకు సొమ్ము విడుదల చేశామన్నారు. మూడు, నాలుగు త్రైమాసిక బకాయిలను జూన్ 2022 కి చెల్లిస్తామన్నారు. డిస్కంలకు సబ్సిడీ కింద చెల్లించాల్సిన రూ.3700 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. విద్యుత్ ఉత్పత్తి సంస్థల తరపున సీనియర్ న్యాయవాదులు వైద్యనాథన్, సజన్ పూవయ్య వాదనలు వినిపిస్తూ.. బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఎక్కువ గడువు కోరుతోందన్నారు. ప్రధాన వ్యాజ్యాలపై తుది విచారణ జరపాలని కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను జనవరి 17 కి వాయిదా వేసింది.

ఇదీచవండి.

ABOUT THE AUTHOR

...view details