మద్యం మత్తులో బస్సును నడుపుతున్నారనే అభియోగంతో, సహచరులు చెప్పిన నోటిమాటల ఆధారంగా ఓ ఆర్టీసీ డ్రైవర్ను సర్వీసు నుంచి తొలగించడాన్ని తప్పుపడుతూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. పూర్వ ప్రయోజనాలన్ని కల్పిస్తూ.. ఆ డ్రైవర్ను సర్వీసులోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పును ఎనిమిది వారాల్లో అమలు చేయాలని ఆర్టీసీ అధికారులకు తేల్చిచెప్పింది. వైద్య పరీక్షలు చేయకుండా మద్యం మత్తును నిర్ధారించడానికి వీల్లేదని స్పష్టంచేసింది. సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ విశాఖ ఆర్టీసీ డిపో మేనేజరు 2014లో దాఖలు చేసిన అప్పీలు కొట్టేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం ఇటీవల ఈమేరకు తీర్పు ఇచ్చింది.
2004 జనవరి 3న మద్యం మత్తులో బస్సును నడుపుతున్నాడనే కారణంతో విశాఖపట్నం జిల్లా జ్ఞానాపురానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ సీహెచ్ వెంకటేశ్వరరావును సర్వీసు నుంచి తొలగించారు. ఆ ఉత్తర్వులను ఇండస్ట్రీయల్ ట్రైబ్యునల్ / కార్మిక కోర్టులో డ్రైవర్ సవాలు చేశారు. అక్కడ ఎదురుదెబ్బ తగలడంలో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. వైద్య పరీక్షల రిపోర్ట్ లేకుండా సర్వీసు నుంచి తొలగించడాన్ని తప్పుపట్టారు. డ్రైవర్ను విధుల్లోకి తీసుకోవాలని 2013 సెప్టెంబర్లో తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును సవాలు చేస్తూ విశాఖ ఆర్టీసీ డిపో మేనేజరు 2014లో ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు. దానిపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది.