న్యాయవ్యవస్థ, హైకోర్టు న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టింగ్ విషయంలో దర్యాప్తు పూర్తి చేయడానికి మరో మూడు నెలల సమయం కావాలని సీబీఐ హైకోర్టును అభ్యర్థించింది. దర్యాప్తును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు పురోగతిపై జూన్ 26న మూడో స్థాయి నివేదికను సీల్డ్ కవర్లో దాఖలు చేశామని సీబీఐ తరఫు న్యాయవాది చెన్నకేశవులు తెలిపారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది. పూర్తి వివరాలతో నివేదిక దాఖలు చేయాలని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మల్య బాగ్చీ , జస్టిస్ కె.సురేశ్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
High court: సోషల్ మీడియాలో జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసు విచారణ - సోషల్ మీడియాలో జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు న్యూస్
సామాజిక మాధ్యమాల్లో(social media) హైకోర్టు జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల అంశంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. మూడుసార్లు స్టేటస్ రిపోర్టు ఇచ్చామని హైకోర్టుకు(high court) సీబీఐ తెలిపింది. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది.
వివిధ వ్యాజ్యాల్లో న్యాయస్థానం తీర్పుల వెల్లడి అనంతరం హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా, న్యాయమూర్తులను తీవ్ర పదజాలంతో దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన పలువురిపై సీఐడీకి ఫిర్యాదు చేసినా చర్యలు లేవని పేర్కొంటూ హైకోర్టు అప్పటి ఇన్ఛార్జి రిజిస్ట్రార్ జనరల్ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం 2020 అక్టోబర్ 12 న దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఈ వ్యాజ్యం తాజాగా మరోసారి విచారణకు వచ్చింది. దర్యాప్తు పూర్తి అయ్యిందా ? అని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు సీబీఐ తరఫు న్యాయవాది బదులిస్తూ .. దర్యాప్తు పూర్తి చేసేందుకు మరో మూడు నెలల సమయం పడుతుందని కోర్టుకు తెలిపారు.
ఇదీ చదవండి:WATER DISPUTE: తెలంగాణ విద్యుదుత్పత్తిపై హైకోర్టుకు ఏపీ రైతులు
TAGGED:
హైకోర్టు తాజా వార్తలు