ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

High Court: పాదయాత్రపై ఇంకా ఎందుకు నిర్ణయం తీసుకోలేదు?: హైకోర్టు - ఏపీ తాజా వార్తలు

High Court: రాజధాని రైతుల పాదయాత్ర విషయంలో పోలీసులు, ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇవాళ అనుమతిపై సాయంత్రంలోగా ఏదో ఒకటి తేల్చాలని ఆదేశించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

High Court
హైకోర్టు

By

Published : Sep 8, 2022, 2:52 PM IST

Updated : Sep 9, 2022, 6:42 AM IST

High Court: రాజధాని రైతులు తలపెట్టిన మహా పాదయాత్రకు అనుమతి ఇచ్చే విషయంలో డీజీపీ గురువారం (8వ తేదీ) తగిన ఉత్తర్వులు ఇస్తారని హోంశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది (జీపీ) మహేశ్వరరెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఆ వివరాలను నమోదు చేసిన న్యాయమూర్తి.. విచారణను ఈనెల 9కి వాయిదా వేశారు. డీజీపీ జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు ముందుంచాలని స్పష్టం చేశారు. యాత్రకు అనుమతి ఇస్తే మంచిదని, లేని పక్షంలో ఆ ఉత్తర్వుల చట్టబద్ధతను పరిశీలిద్దామని వ్యాఖ్యానించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

అమరావతి రైతు ఉద్యమం ప్రారంభమై వెయ్యి రోజులకు చేరుకుంటున్న సందర్భంగా అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు ఈనెల 12 నుంచి తలపెట్టిన మహాపాదయాత్రకు అనుమతి ఇచ్చేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు, ఎ.శివారెడ్డి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. గురువారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా.. పాదయాత్ర నిర్వహించేందుకు హైకోర్టు గతంలో అనుమతి ఇస్తూ ఉత్తర్వులిచ్చిందని న్యాయమూర్తి గుర్తుచేశారు. ప్రస్తుత వ్యాజ్యం ఆ ఉత్తర్వుల పరిధిలోకి వస్తుంది కదా అని జీపీని ప్రశ్నించారు. పాదయాత్రకు అనుమతి కోరుతూ పిటిషనర్‌ ఆగస్టు 27నే వినతి సమర్పిస్తే ఇప్పటి వరకు డీజీపీ నిర్ణయం తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు.

జీపీ స్పందిస్తూ.. గతంలో తిరుపతికి చేపట్టిన పాదయాత్రలో కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఈ వ్యవహారమై 60 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రస్తుత పాదయాత్రకు అనుమతి ఇచ్చే విషయంలో ఆయా జిల్లాల ఎస్పీల నుంచి డీజీపీ ఇప్పటికే సమాచారం తెప్పించుకున్నారని గురువారం ఆయన తగిన ఉత్తర్వులు జారీ చేస్తారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విచారణను శుక్రవారానికి వాయిదా వేయాలని కోరారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. శాంతియుతంగా నిర్వహించే పాదయాత్రకు ముందస్తు అనుమతి అవసరం లేదని తెలిపారు.

సీఆర్డీఏ సవరణలపై హైకోర్టును ఆశ్రయిస్తాం: సీఆర్డీఏ చట్టానికి వైకాపా ప్రభుత్వం చేసిన సవరణలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని రైతులు తేల్చిచెప్పారు. సీఆర్డీఏ చట్టానికి సవరణలు తీసుకొస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రైతులు, ఐకాస నాయకులు తప్పుపట్టారు. ముప్పు ప్రాంతం, శ్మశానం అన్న మంత్రులు ఈ భూముల్లో పేదలకు స్థలాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇది న్యాయస్థానం తీర్పును ఉల్లఘించడమేనన్నారు. దళితుల మధ్య చిచ్చుపెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని రైతులు ఆరోపించారు. అభివృద్ధి చేయాల్సిందిపోయి.. వినాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో పేదలకు భూములిస్తే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందన్నారు. పేదల పేరుతో రాజధాని భూములు కాజేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 9, 2022, 6:42 AM IST

ABOUT THE AUTHOR

...view details